ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న జూనియర్ వైద్యులు, సీనియర్ రెసిడెంట్స్ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికిచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించి... ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. అలాగే వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని తమ్మినేని తెలిపారు. న్యాయపరమైన వీరి డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్ల జుడాలు, సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్ల అసోసియేషన్లు ఈ నెల 26 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయని ఆయన పేర్కొన్నారు.
కరోనా సమయంలో వైద్యులు సమ్మె చేస్తే... మొత్తం ఆరోగ్య వ్యవస్థే కుప్పకూలుతుందని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించి సమ్మె జరగకుండా చూడాలని తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని వైద్యులకు గౌరవ వేతనం పెంచాలన్నారు. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్స్ అందరికీ వేతనాలు పెంచడంపై ముఖ్యమంత్రి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు