కరోన టెస్టులు విస్తృతంగా చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని.. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలో నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజల ప్రాణాలు కాపాడు నినాదంతో నల్లబ్యాడ్జీలతో సీపీఎం శ్రేణులు గోల్కొండ చౌరస్తాలో నిరసన చేపట్టాయి. కరోనా వైరస్ తక్కువగా ఉన్న సమయంలో రోజుకో ప్రెస్‌మీట్ పెట్టిన ముఖ్యమంత్రి, వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యారని సీపీఎం నాయకులు దశరథ్ ఆరోపించారు. ప్రైవేటు కార్పోరేటు ఆస్పత్రును కరోనా పాజిటివ్ బాధితులను వ్యాపార సరుకుగా చూస్తున్నాయని, తెలంగాణ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయని.. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మేలుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని, కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు.
అందరికి ఉచిత వైద్యం అందించాలని, పేదలకు ప్రతి నెల మనిషికి పది కిలోల చొప్పున రేషన్, 7500 రూపాయల నగదు 6 నెలల పాటు ప్రభుత్వమే అందించాలని, కరోనా పరీక్షలు విస్తృతంగా చేసి.. ఐసోలేషన్ సెంటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజాందోళన కార్యక్రమాలపై నిర్బంధాన్ని ఆపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, జి.ఓ 45 ప్రకారం ప్రైవేటు ఉద్యోగులకు ఆదాయ భద్రత కల్పించాలని, తొలగించిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన నిధులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.రాములు, ఏ. శ్రీరాములు, పి.పద్మ, జకీర్, పాషా, వెంకటేష్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్