cpi national secretary comments on vishaka steel: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలని అందుకు కార్మిక రంగం వైపు నుంచి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మొన్న సభలో ఇష్టమున్నట్లు మాట్లాడారని ఆక్షేపించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు ప్రజల డబ్బుతో అభివృద్ది చేసి ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.
అదానీ కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంపై మోదీ ఎక్కడా మాట్లాడలేదన్నారు. మోదీ ఊపిరి ఆయన చేతిలో ఉన్నందునే... దేశాన్ని అప్పనంగా అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షను నారాయణతో పాటు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అదానీని కాపాడే పనిలో మోదీ ఉన్నారని నారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న 15 నియోజకవర్గాల్లో ఇంటింటికి సీపీఐ పేరుతో పాదయాత్ర చేపడుతున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ నెల 14వ తేదీన ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో ఇంటింటికి పాదయాత్రలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
బిడ్డింగ్‌లో తెలంగాణ: విశాఖ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం ఆసక్తి చూపుతోంది. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ ఈ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ బిడ్డింగ్ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారుల బృందం విశాఖకు వెళ్లనుంది.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉక్కును సమకూర్చుకోవడం మొదలగు లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం బిడ్డింగ్ ద్వారా ఎంత మొత్తంలో నిధులను సేకరిచాలనుకుంటున్నారు. వారు సరఫరా చేసే ఉత్పత్తులు లేదా నిధులను తిరిగి చెల్లించే విధానం, ఇతర షరతులు, నిబంధనలను వివరంగా అధ్యయనం చేయనున్నారు.
ఇవీ చదవండి: