CPI meetings in Delhi from 14th to 17th of this month : దేశాన్ని విచ్ఛన్నం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు నారాయణ మండిపడ్డారు. మేధావులు.. ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటుంటే, మోదీ, అమిత్ షాలు మాత్రం ప్రజల మధ్య భావోద్వేగాలను రగిలిస్తూ, విద్వేషాలను పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయంటే.. ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే విపక్షాల ఐక్యరాగంతో.. మోదీ ఉమ్మడి పౌరస్మృతి, రామమందిర మంత్ర జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అధిక శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న ఆయన.. ప్రస్తుతం దేశంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతున్న నేపథ్యంలో మరోసారి కామన్ సివిల్ కోడ్‌ను తెరపైకి తెచ్చారన్నారు.
Uniform Civil Code In India : ఈ క్రమంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని మోదీ, బీజేపీ నాయకులకు దేశ రాజ్యాంగం గురించి గానీ, ప్రజల ఐక్యత గురించి గానీ ఏం తెలుసని నారాయణ ప్రశ్నించారు. మోదీ ఒక చరిత్రహీనుడని అభివర్ణించారు. మణిపూర్ ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రధాని మోదీ, అమిత్‌షాలు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఎందుకు పిలుపునివ్వడం లేదని ఆయన నిలదీశారు. దేశం ఏమైనా ఫర్వాలేదు కానీ.. గెలవాలన్నదే బీజేపీ ధ్యేయమన్నారు.
CPI Narayana on Uniform Civil Code In India : ఉమ్మడి పౌరస్మృతితో ఇతర మతాలను ధ్వంసం చేయాలనే రచన చేస్తున్నారని నారాయణ ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్ష పార్టీలు మోదీకి జై కొడుతున్నాయన్న ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం మోదీని వ్యతిరేకిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇది ఇలాగే కొనసాగించాలని కోరారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల జోక్యం పెరిగిపోతుందన్న నారాయణ.. ప్రస్తుతం దేశంలో ఆర్డినెన్స్ పాలన సాగుతుందని.. ఆర్డినెన్స్ పాలన చేసేందుకు రాష్ట్రాలు, గవర్నర్లు, వ్యవస్థలు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు దిల్లీలో సీపీఐ సమావేశాలు నిర్వహిస్తున్నామని.. ఈ సమావేశాల్లో భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ వస్తుంది కానీ.. మనీష్ సిసోడియాకు మాత్రం బెయిల్ రాదని నారాయణ వ్యాఖ్యానించారు.
''దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం. రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయంటే.. ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారు. విపక్షాల ఐక్యరాగంతో.. మోదీ ఉమ్మడి పౌరస్మృతి, రామమందిర మంత్ర జపం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అధిక శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతితో ఇతర మతాలను ధ్వంసం చేయాలనే రచన చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల జోక్యం పెరిగిపోతుంది.'' - నారాయణ, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు
కేసీఆర్‌కు కూనంనేని లేఖ..: 2004కు ముందు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదలై.. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారందరికీ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దేశంలో నూతన పింఛన్ విధానంలో భాగంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ ఒకటిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. ఉద్యోగులను బలవంతంగా ఈ పింఛన్ విధానంలోకి తీసుకురావడంతో చాలామంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇవీ చూడండి..
జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఉమ్మడి పౌరస్మృతిపై ముందడుగు?