తమిళనాడులో ఏఐఏడీఎంకే అండతో అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ గంట ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రాయితీలు ప్రకటిస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు పరాభవం తప్పదని అన్నారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. అధికారమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీకి దత్త పుత్రుడు ముకేశ్ అంబాని అని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉంటే కార్పొరేట్ రంగం లాభంలో ఎలా ఉందని ప్రశ్నించారు. నిజాం లాగే రైతులపై కార్పొరేట్ల విధానం ఉండనుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ప్రైవేటు పరం చేస్తామని పీఎం అనడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అనైతిక కార్యకలపాలకు పాల్పడుతోందన్నారు. సీఎం కేసీఆర్ పీవీ పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు పీవీ పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాసకు ఉనికి లేదని నారాయణ ఎద్దేవా చేశారు.