కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం వారిద్దరికీ ఇష్టంలేదని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రి అమిత్‌షాకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సాయుధ పోరాట యోధులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవానికి భాజపా మాత్రం మతం రంగు పులుముతోందని నారాయణ అగ్రహం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత భాజపా నేతలకు లేదన్నారు.
రాష్ట్రంలో భాజపా, తెరాసలు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెరాస, భాజపాలదీ తెలంగాణలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ అని ఆరోపించారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. బండి సంజయ్ ప్రజా దగా యాత్ర చేస్తున్నారని చాడ విమర్శించారు. ఎంఐఎంతో దోస్తీ కారణంగానే కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంలేదని ఆక్షేపించారు. రాష్ట్ర సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17వరకు సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళి కార్యక్రమాలు చేపడతామని అయన వివరించారు.
ప్రతి విషయాన్ని మతపరమైన సమస్యగా మార్చేందుకు భాజపా నాయకులు యత్నిస్తున్నారు. హిందూమతం పేరిట వివాదం సృష్టిస్తున్నారు. మేము కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్నాం. అమిత్‌షాకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి. సీఎం కేసీఆర్ కూడా దీన్ని అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం తరఫున కూడా ఏం చేయట్లేదు. దీనిపై తెరాస, భాజపాతో లాలూచీ పడుతున్నట్లు అనిపిస్తోంది. అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. - నారాయణ, సీపీఐ జాతీయ నేత
తెలంగాణలో ఈనెల 27న జరగనున్న భారత్ బంద్‌కు సంపూర్ణంగా మద్దతిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. కేవలం ఒకటి, రెండింటిపైనే దృష్టి సారించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీలో తెరాస విఫలమైంది. మరోవైపు భాజపాతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారు. - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చూడండి: