కాంగ్రెస్ తర్వాత సీపీఐకే సుదీర్ఘ చరిత్ర ఉందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పోరాడేతత్వాన్ని ఎర్రజెండా ఇచ్చిందని అన్నారు. భూమి, భుక్తి కోసం తెలంగాణను భారత్‌లో కలపాలని సీపీఐ పెద్ద ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. కార్మికులు, యువకులు, ఉద్యోగులు, కళాకారులను సమీకరించి మహోత్తర ఉద్యమాలు చేసిందని వివరించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్ మఖ్దూం భవన్‌లో సీపీఐ 96వ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ఆయన ప్రారంభించారు.
రైతులు, వ్యవసాయం గురించి తెలిసిన వారెవరైనా సాగు చట్టాలను తీసుకురారని... ఈ చట్టాలు అదానీ, అంబానీ, మోదీలు చేశారంటూ సురవరం ఆరోపించారు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా 80వేల ట్రక్కులతో లక్షలాది మంది రైతులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపాలయ్యాం కానీ... కాలం చెల్లిన నినాదాలతోనే ఓడిపోయామనడం సమంజసం కాదన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో గెలుపోటములు సహజమన్నారు. రైతుల పోరాటాన్ని బలహీన పరిచేందుకు కేంద్రం అనేక కుట్రలు చేసిందని ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలోని పాలకులు ప్రజాప్రతినిధులుగా కాకుండా ప్రభువులుగా చెలామణి అవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతును నొక్కెస్తూ ప్రజాస్వామ్యాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్పొరేటరీకరణ, ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: అన్నం ముట్టదు.. మిక్చర్ వదలదు!