తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ప్రారంభమైన బస్సు యాత్ర ఈ నెల 17న ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు. బహిరంగ సభలో స్వాత్రంత్య్ర సమరయోధులతోపాటు మలిదశ ఉద్యమకారులు, కళాకారులను సన్మానిస్తామని అన్నారు.
హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధపోరాటం 72వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి చాడ వెంకట్ రెడ్డి, తెజస అధ్యక్షుడు కొదండరాం, సీపీఐ రాష్ట్ర నాయకత్వం, స్వాత్రంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. అమరవీరుల స్మృతి చిహ్నం, రావి నారాయణ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు.
తెలంగాణ సమాజానికి దిక్సూచి రైతాంగ సాయుధ పోరాటమని తెజస అధ్యక్షుడు ఆచార్య కొదండరాం అన్నారు. ఫ్యూడల్ వ్యవస్థను కూల్చడానికి జరిగిన పోరాటమని.. మతం మీద జరిగిన పోరాటం కాదన్నారు. సామాజిక, ఆర్థిక రంగంలో ఉన్న అసమానతల మీద పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఉద్యమం వేర్వేరు రూపాల్లో ఫ్యూడల్‌పై పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'కండువా కప్పే ఉత్సాహం రైతులపై చూపిస్తే బాగుంటది'