దిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్ విమర్శించారు. నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 35 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. కేంద్రం వెంటనే పార్లమెంటును సమావేశపరచి చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస మద్దతుధరతో పాటు చట్టాలలో మార్పులను లిఖితపూర్వకంగా పొందుపరచాలని కర్షకులు కోరడం వారి పోరాట పటిమకు నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్నదాతల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.