cpget2022: రాష్ట్రంలో ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలైన ఓయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో చేరాల్సి ఉన్నందున వారికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించినట్లు తెలిపారు. జూన్ నెలాఖరుకు డిగ్రీ చివరి సెమిస్టర్(ఆరో) పరీక్షలు పూర్తి చేయాలని సూచించామన్నారు. ఫలితాలు సకాలంలో విడుదల చేసి, ధ్రువపత్రాలు అందించాలని నిర్ణయించినట్లు ఆర్.లింబాద్రి తెలియచేశారు.
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు..
విశ్వవిద్యాలయాలకు గతంలో ఉన్న జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్) గడువు పూర్తి కావొస్తున్నందున అందుకోసం మళ్లీ సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. వర్సిటీల పరిధిలోని కళాశాలలూ న్యాక్ హోదా పొందేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. న్యాక్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కళాశాలలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని మూడేళ్లుగా చెప్పినా ఒక్కరూ ముందుకు రాలేదు. ఇకనైనా ఉపకులపతులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రోత్సహించాలి. రాష్ట్రంలో 125 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా 84 కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉంది.
కళాశాలలకు తాత్కాలిక న్యాక్ ఇచ్చే వెసులుబాటును వినియోగించుకోవాలి. కనీస ప్రమాణాలను పరిశీలించి ఒకటి లేదా రెండేళ్లు న్యాక్ ఇస్తారు. ఆలోపు తగిన వనరులను సమకూర్చుకుంటే మూడు లేదా అయిదేళ్లపాటు శాశ్వత అక్రిడిటేషన్ జారీ చేస్తారు. బీఏ బదులు బీకాం, బీకాం స్థానంలో బీఎస్‌సీ కోర్సుల నిర్వహణకు అవకాశం కల్పిస్తారు. అందుకు అవసరమైన సదుపాయాలు కాలేజీల్లో ఉన్నాయో లేదో ఆయా వర్సిటీలు క్షుణ్నంగా తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలి. ప్రతి కళాశాల ఏటా అఖిల భారత ఉన్నత విద్య సర్వే(ఏఐఎస్‌హెచ్‌ఈ)కి అవసరమైన డేటాను సకాలంలో అప్‌లోడ్ చేయాలి. రాష్ట్రంలో 2029 విద్యాసంస్థలుండగా.. 1982 మాత్రమే వివరాలను పంపాయి. అప్‌లోడ్ చేయని కళాశాలలపై ఆరా తీయాలి.
సీపీగెట్‌లో మార్పులపై యోచన
సీపీగెట్‌లో రెండు, మూడు సబ్జెక్టులకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలు 10 రోజులపాటు జరుగుతున్నాయి. కొందరు విద్యార్థులు రెండు, మూడు సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి వస్తోంది.
ఉదాహరణకు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొందరు ఆ రెండింటికీ హాజరవుతున్నారు. ఈసారి రెండు సబ్జెక్టులకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. రెండు సబ్జెక్టులకు సంబంధించి చెరి సగం ప్రశ్నలిస్తారు. అందులో ఉత్తీర్ణులైనవారు ఆ రెండు కోర్సుల్లో ఏదో ఒక దాంట్లో చేరవచ్చు. గణితం, సాంఖ్యకశాస్త్రం (స్టాటిస్టిక్స్).. ఇలా ఒకే పరీక్ష నిర్వహించేందుకు అవకాశమున్న సబ్జెక్టులను గుర్తించి నోటిఫికేషన్ వెలువడే నాటికి స్పష్టత ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: tspsc group1: నేడో రేపో గ్రూపు-1 నోటిఫికేషన్