లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో నిండుకుంటున్న రక్తపు నిల్వలను పెంచి తలసేమియా వ్యాధిగ్రస్థులను కాపాడేందుకు సైబరాబాద్ పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ, పోలీసుల అధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వాలంటీర్ల సహాయంతో 117యూనిట్ల రక్తాన్ని సేకరించారు. తలసేమియాతో బాధపడుతున్న రోగులు, ముఖ్యంగా చిన్నారుల కోసమే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ వివరించారు. ఈ శిబిరంలో సీపీ సజ్జనార్ కూడా రక్తదానం చేశారు.
ఎవరైనా రక్తదానం చేయాలనుకునేవారు 9490617440, 9490617431 నెంబర్లను సంప్రదిస్తే... పోలీసు వాహనంలో తీసుకొచ్చి... రక్తాన్ని సేకరించి... మళ్లీ ఇంటి వద్దకు సురక్షితంగా చేర్చుతామని సజ్జనార్ తెలిపారు. ఒక వ్యక్తి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు నిలుస్తాయన్నారు. రక్తదానంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు.