కరోనా సోకి ఆసుపత్రుల చుట్టూ తిరిగే సామాన్యుల కష్టాలు అన్నీఇన్నీ కావు. చేరినప్పటి నుంచి చికిత్స ముగించుకొని వెళ్లే వరకు, చనిపోతే దహనం కోసం ‘మరణ ధ్రువీకరణ పత్రం’ పొందే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఓవైపు కుటుంబ సభ్యులకు మంచి వైద్యం అందింపజేయడం ఎలా అని ఆలోచించడం.. మరోవైపు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించడం కష్టతరంగా మారుతోంది. ఎవరైనా ప్రజా ప్రతినిధి తెలిస్తే గానీ, ప్రముఖులతో పరిచయాలుంటే గానీ పనులు జరగడంలేదని బాధితుల బంధువులు వాపోతున్నారు.
ఫోన్ చేస్తేనే పడక...
కరోనాతో శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తిని బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించారు. పది ఆసుపత్రులు తిరిగినా పడకలు ఖాళీగా లేవన్నదే సమాధానం. చివరకు ఓ ప్రజా ప్రతినిధితో పైరవీ చేయిస్తే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చుకున్నారు. పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని ప్రముఖుల కోసం రిజర్వు చేయడం వల్ల పైరవీలు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ధ్రువీకరణ పత్రానికి ఎదురుచూపులే...
కొవిడ్‌తో చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రం కోసమూ ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా ఓ వ్యక్తి చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఇ-సేవలో దరఖాస్తు చేసుకుంటే వారం నుంచి పది రోజుల్లో ఆన్‌లైన్‌లో తీసుకునే వెసులుబాటు ఉంది. కరోనాతో చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.
- ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కరోనాతో ఆసుపత్రిలో చనిపోయిన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రానికి ఇ-సేవలో అర్జీ పెట్టేందుకు యత్నించాడు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అక్కడికెళితే ఆసుపత్రి నుంచే వివరాలు వస్తాయని, చనిపోయిన తేదీ నుంచి 21 రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో పొందవచ్చని సిబ్బంది తెలిపారు.
- బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకగా, కుమారుడు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. అంత్యక్రియల కోసం ఆరా తీయగా తొలి దశలో.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, పోలీసులు ఆసుపత్రికి వచ్చి ధ్రువీకరించాలని; రెండో దశలో.. స్థానిక జీహెచ్‌ఎంసీ కార్యాలయం ధ్రువీకరణ పొందాలని, మూడో దశలో.. కొవిడ్ మృతదేహాలకు అనుమతి ఉన్న శ్మశానంలోనే దహనం చేయాలని తెలిసింది. ఇదంతా పూర్తిచేసి మృతదేహాన్ని అంబులెన్స్‌లో సగం దూరం తీసుకెళ్లాక శ్మశానానికి ఫోన్ చేస్తే జీహెచ్‌ఎంసీ అనుమతి రాలేదని, నిర్లక్ష్యంగా చెప్పారని ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారుల అనుమతి కావాలంటూ కొందరు చెబితే మాకు సంబంధం లేదంటూ ఉన్నతాధికారులు తప్పించుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. చివరకు ఓ ప్రజాప్రతినిధి నంబర్‌కు ఫోన్ చేసి చెబితే వెంటనే స్పందించారని, వెంటనే సహాయకులతో ఫోన్ చేయించి అంత్యక్రియలు సాఫీగా అయ్యేలా చూశారని తెలిపారు. ఉదయం 7.30 నుంచి ప్రయత్నించగా సాయంత్రం 4.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయని వాపోయాడు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్