హైదరాబాద్ మల్లాపూర్‌లో ఆయాసంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చనిపోయిన 8 నెలల గర్భిణి పావని మృతిపై ఆమె తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. కొవిడ్ అనుమానంతో తమ కుమార్తెకు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం జరిగిన గర్భిణీ, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన వైద్యాధికారులు ఇవాళ మల్లాపూర్‌లోని పావని కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. మల్లాపూర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది పావని ఇంటికి చేరుకొని.. ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. కుటుంబసభ్యులందరికీ నెగిటివ్‌గా తేలింది. ఈ మేరకు తమ కుటుంబంలో ఎవరికీ కరోనా రాలేదని.. తమ కుమార్తె కరోనాతో చనిపోలేదని పావని తల్లిదండ్రులు నీలవేణి, జోగారావు వాపోయారు. తమ కుమార్తెకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'