Corona home test kit cost : చౌకధరలో ఎవరికి వారే సొంతంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షను చేసుకునే వెసులుబాటు రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విధానంలో కిట్‌ను కొనుగోలు చేసుకొని, ఇంట్లోనే పరీక్ష చేసుకోవచ్చు. టోకుధర(హోల్‌సేల్)ల విపణిలో ఈ కిట్ ధర ప్రస్తుతం రూ.6లుగా ఉంది. ఔషధ దుకాణాల్లో ఇది రూ.50-100 ఖరీదుకే దొరికే అవకాశం ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ కిట్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. యాంటీజెన్ కిట్ల ద్వారా చేసుకునే ఈ పరీక్షలు ఎవరికి వారు నిర్వహించుకునేందుకు ఆరోగ్యశాఖ తాజాగా అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇకపై యాంటీజెన్ కిట్ల ద్వారా పరీక్షలు చేసే వెసులుబాటు కలిగింది.
నమూనా జాగ్రత్తగా తీయాలి...
ఇంటి వద్ద పరీక్ష చేసుకునే ఈ కిట్లను ఎలా వినియోగించాలనే విషయం పత్రరూపంలో ముద్రిస్తారు. ఇళ్లలో నిర్వహించుకునే మధుమేహ, గర్భ నిర్ధారణ పరీక్షల మాదిరిగానే దీన్నీ సులువుగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముక్కు లోపలి నుంచి జాగ్రత్తగా నమూనాలను బయటకు తీసి, పరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే స్వీయ పరీక్ష వల్ల ఉపయోగం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,100 కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలే నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చి.. లక్షణాలుంటే మాత్రం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. వీటి పరీక్షలను మాత్రం ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లోనే నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: Omicron effect on Children: 'పిల్లలపైనా ఒమిక్రాన్ ప్రభావం.. బాధితుల్లో 22 శాతం చిన్నారులే'