జంటనగరాల్లో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. మౌలాలి పరిధిలోని మారుతినగర్లో 60 ఏళ్ల వృద్ధురాలు వైరస్‌తో మృతి చెందారు. నగర శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఓ బ్యాంకు ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఓ అధికారికి, ఇద్దరు సిబ్బందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు ఇంటర్ బోర్డులో ఆరుగురికి కరోనా నిర్ధరణ అయింది.
ఆరోగ్య సిబ్బందికి కూడా
బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్సు, ముగ్గురు ఆశా వర్కర్లకు వైరస్ సోకింది. ఆరోగ్య కేంద్రంలో ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హోం మంత్రి వద్ద ఎస్కార్టు విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో 36 మందికి వైరస్ సోకింది. కాచిగూడ డివిజన్లో ఇద్దరు, గోల్నాక తులసినగర్‌లో ఒకరు కరోనాతో మరణించారు. అంబర్‌పేట్ పోలీస్ క్వార్టర్స్ 6వ బ్లాక్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్‌కు పాజిటివ్ నిర్ధరణయింది.
తహసీల్దార్ చంద్రకళకు కరోనా
ఆజాద్‌నగర్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకింది. కాచిగూడ డివిజన్ పరిధిలో ఒక కుటుంబంలో ముగ్గురు వృద్ధులకు పాజిటివ్ వచ్చింది. షంషేర్బాగ్లో భార్య భర్తలతోపాటు ఏడేళ్ల బాబుకి కొవిడ్ నిర్ధరణయింది. అమీర్‌పేట్ తహసీల్దార్ చంద్రకళకు వైరస్ సోకింది. తహసీల్దార్ కార్యాలయాన్ని బల్దియా సిబ్బంది శానిటైజేషన్ చేశారు. మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. యూసుఫ్‌గూడ సర్కిల్ 19, వెంగళరావునగర్ డివిజన్లో 2, యూసుఫ్‌గూడ డివిజన్లో 2, ఎర్రగడ్డ డివిజన్లో 1, రహ్మత్‌నగర్ డివిజన్లో 3, బోరబండ డివిజన్లో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు.
ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా సోకినట్లు కమిషనర్ సుమన్ రావు తెలిపారు. ఇదే కుటుంబంలో 10 రోజుల క్రితం వృద్ధుడు కరోనాతో మృతిచెందాడని, ఇప్పుడు ఆయనతో సంబంధం ఉన్న 12 మందికి కొవిడ్ సోకిందని చెప్పారు. ఇటీవల కరోనా సోకిన నటుడు ప్రభాకర్‌తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా నిర్ధరణ అయింది.
స్వచ్ఛంద లాక్డౌన్
కేసులు క్రమంగా పెరుగుతుండడం వల్ల నగరంలోని ప్రధాన మార్కెట్లలోని వ్యాపారులు వారం పాటు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. శనివారం నుంచి వారం రోజుల పాటు కోఠిలోని ట్రూప్‌బజార్‌లో దుకాణాలు మూసివేస్తున్నారు. ఆదివారం నుంచి బేగంబజార్, రాణిగంజ్, జనరల్బజార్తోపాటు వారం పాటు ప్రధాన మార్కెట్లు మూసివేయనున్నారు.
ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్