రాష్ట్రంలో మార్చి రెండో వారం నుంచి పరీక్షల సంఖ్య రోజూ సగటున 45-50 వేలు దాటుతున్నా.. పాజిటివ్ రేటు మాత్రం 1 శాతంలోపే ఉంటూ వచ్చింది. గత నెలాఖరుకు ఒకటి దాటింది. అక్కడ్నుంచి పైపైకి ఎగబాకుతోంది.
నవంబరు నాటి పరిస్థితులు పునరావృతం
గత ఏడాది నవంబరులో ఒక్క రోజులో 1000 కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో ఈ నెలలో గత మూడు రోజులుగా నిత్యం వెయ్యికిపైగా నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న బాధితులు కూడా గత వారం రోజుల్లో దాదాపు రెట్టింపయ్యారు. గత నెల 29న చికిత్స పొందే కొవిడ్ బాధితులు 4,678 మంది ఉండగా, తాజా గణాంకాల ప్రకారం ఈ నెల 4న ఆ సంఖ్య 8,746కు చేరింది. రెణ్నెళ్ల కిందటి వరకూ మొత్తం పాజిటివ్‌ల్లో దాదాపు 70% ఇంటి వద్ద ఐసొలేషన్ చికిత్సలు పొందుతుండగా, ఇప్పుడు ఆ పరిస్థితీ మారింది. ప్రస్తుతం రాష్ట్రంలోని బాధితుల్లో దాదాపు సగం మంది(4,458) మాత్రమే ఐసొలేషన్‌లో వైద్యసేవల్లో ఉండగా.. మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
3.13 లక్షలకు పెరిగిన బాధితులు
రాష్ట్రంలో కొత్తగా 1,097 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, మొత్తం బాధితుల సంఖ్య 3,13,237కు పెరిగింది. మరో 6 మరణాలు సంభవించడంతో, ఆ సంఖ్య 1,723గా నమోదైంది. తాజాగా 268 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా మొత్తంగా 3,02,768 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో 37,338 ప్రైవేటులో 5,732 పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,04,35,997కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 302 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 24, జగిత్యాలలో 32, కామారెడ్డిలో 28, కరీంనగర్‌లో 38, మహబూబ్‌నగర్‌లో 22, మేడ్చల్ మల్కాజిగిరిలో 138, నిర్మల్‌లో 42, నిజామాబాద్‌లో 77, రంగారెడ్డిలో 116, సంగారెడ్డిలో 52, వరంగల్ నగర జిల్లాలో 28 చొప్పున నిర్ధారణయ్యాయి. మిగిలినజిల్లాల్లో 20కంటే తక్కువగా ఉన్నాయి. ఆదివారం మరో 31,263 మంది తొలిడోసు, 4,045 మంది రెండోడోసు టీకాలను పొందారు. వీరిలో 45 ఏళ్లు పైబడినవారే 95 శాతానికి పైగా ఉన్నారు. రాష్ట్రంలో టీకాల వృథా 2.77 శాతంగా నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు.
80 శాతం మందికి లక్షణాల్లేవ్
మొత్తం బాధితుల్లో 79.8 శాతం మంది ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతుండటం ప్రమాదకర సంకేతమని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కొవిడ్‌ను త్వరితగతిన అడ్డుకోవడంలో భాగంగా బాధితులతోపాటు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులనూ పరీక్షిస్తున్నాం. ఈ నెల 4న(ఆదివారం) 43,070 నమూనాలను పరీక్షించగా, ఇందులో 48.6 శాతం మంది ప్రైమరీ, 12.5 శాతం మంది సెకండరీ కాంటాక్టు వ్యక్తులే ఉన్నారు’ అని తెలిపాయి. పాజిటివ్ రేటు క్రమేణా పెరుగుతుండడంపై ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రామీణ ప్రాంతాల్లో విజృంభించకముందే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించగా, పల్లెల్లో ఇంటింటికీ తిరుగుతూ టీకాలపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. రోజూ కనీసం 70-75 వేల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ఇందులో 30-35వేల పరీక్షలు ఆర్‌టీపీసీఆర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఇదీ చూడండి: రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు.. వెంటనే ఆస్పత్రులకు సరఫరా