చాంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళ(50), సంతోష్‌నగర్ చెందిన మరో మహిళ(60) ఇలానే ప్రాణాలు వదిలారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి(53)ని కరోనా అనుమానిత లక్షణాలతో కింగ్‌కోఠికి అంబులెన్స్‌లో తరలించారు. అంబులెన్స్ నుంచి దించి స్ట్రెచర్‌పై పడుకోబెట్టేలోపే ప్రాణాలు వదిలాడు.
జవహర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు(30) మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆటోలో తీసుకొస్తుండగా...అక్కకక్కడే కుప్పకూలిపోయాడు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతున్న మరో వ్యక్తి (33) పరీక్షల కోసం నాచారం ఈఎస్‌ఐకు వెళ్లాడు. అప్పటికే అక్కడ పరీక్షలకు సరిపడా టోకెన్లు జారీ చేయడంతో మరుసటి రోజు రావాలని సూచించారు. ఒక్కరోజు వ్యవధిలో అతని ఆరోగ్యం విషమంగా మారింది. కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కరోనాగా అనుమానించి పరీక్షలకు సిద్ధమవుతుండగానే చనిపోయాడు.
పలువురు అనారోగ్యంతో కింగ్‌కోఠి, ఉస్మానియా ఆసుపత్రులలో చేరేలోపు మృత్యువాత పడుతుండటంతో అధికారికంగా నమోదు కావడం లేదు. ఉస్మానియాకు నిత్యం వస్తున్న అత్యవసర కేసుల్లో 10-15 మంది చనిపోతుండగా.. వీరిలో పలువురు కరోనా ఫలితాలు రాకముందే కన్నుమూస్తున్నారు.
ఎందుకిలా...
గ్రేటర్ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తొలుత చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం ప్రారంభమై అంతలోనే తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తోంది. కొవిడ్ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరేముందు కొందరు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు ఇంటి వద్ద ఉంటూనే చికిత్స పొంది కోలుకుంటున్నారు. ఇలా ఒక్కసారిగా ఆరోగ్యం విషమంగా మారటానికి వైద్యులు రకరకాల కారణాలను పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, మెదడుపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్ల చాలామందిలో అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు.
కొందరు కరోనా బారిన పడినా సరే...బయటకు పెద్దగా లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు లేకపోవడంతో పరీక్షలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిలో కొందరికి లోలోపల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చివరికి తీవ్ర అనారోగ్యానికి దారి తీసి...వెంటిలేటర్ అవసరం ఏర్పడుతోంది. ముందే జాగ్రత్త పడటం వల్ల ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. వాతావరణ మార్పులతో చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళలో.. ఏది సాధారణ ఫ్లూ, ఏది కరోనా అని గుర్తించడం వైద్యులకు సైతం కష్టంగా మారుతోంది. వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స తీసుకునేవారు, వృద్ధులు, గర్భిణుల్లో సమస్య మరింత తీవ్రమవుతోంది.
ఒక్కసారిగా ఆరోగ్యం విషమంగా మారటానికి రకరకాల కారణాలు దోహదం చేస్తుంటాయి. కరోనా రోగుల్లో తరచూగా మయోకార్డిరైటీస్ ప్రధాన సమస్యగా మారుతోంది. దీనివల్ల గుండెలయలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఆరోగ్యం విషమిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమై చనిపోతారు. ప్రతి రోగిలో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందనేది చెప్పలేం.
-డాక్టర్ శివరాజ్, సీనియర్ ఫిజీషియన్
- ప్రస్తుతం కరోనా కారణంగా కొందరు విపరీతంగా భయపడిపోతున్నారు. బీపీ పెరిగిపోయి షాక్‌లోకి వెళుతున్నారు. గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
- ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ల వల్ల ద్రవాలు పేరుకుపోతాయి. గుండెలో పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో బ్రెయిన్‌కు తగినంత ఆక్సిజన్ సరాఫరా కాదు. ఆకస్మిక మరణాలకు ఇది కూడా ఒక కారణం కావచ్ఛు
- ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలి. అన్ని ఆసుపత్రులు ఆన్‌లైన్ ద్వారా వైద్యులను సంప్రదించేందుకు ఏర్పాట్లు చేశాయి. వైద్యుని సూచనల ప్రకారం చికిత్సలు తీసుకోవాలి.
- జ్వరం ఉంటే అయిదు రోజుల్లో సీటీస్కాన్ చేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోవచ్ఛు కొవిడ్ పరీక్ష చేసుకోవాలి. కొవిడ్ వచ్చినా అయిదారు రోజుల్లో సీటీస్కాన్, 2డీ ఈకో, ఈసీజీ పరీక్షలతో ఊపిరితిత్తులు, గుండెలో సమస్యలను గుర్తించి వెంటనే చికిత్స అందిస్తే ఆకస్మిక మరణాలకు అడ్డుకట్ట వేయవచ్ఛు
- ఇప్పటికే అస్తమా, బ్రాంకైటీస్, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి.