* భార్యాభర్తలిద్దరూ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. సూపరింటెండెంట్ పేషీతోపాటు, వేర్వేరు విభాగాల్లో వీరు నిత్యం విధుల్లో ఉంటారు. గతంలో వీరి అపార్ట్‌మెంట్‌లో వైద్య వృత్తిలో ఉన్నందుకు ఎంతో గౌరవం దక్కేది. కరోనా తర్వాత పరిస్థితి మారింది. వారి మాటల్లో మార్పు వచ్చింది. ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడులు వచ్చాయి. అయితే వారు బెదిరిపోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. ఇది తమ వృత్తి ధర్మమని వారికి వివరించారు. వినకపోతే చట్టపరంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పడం వల్ల... క్రమేపీ అర్థం చేసుకున్నారు.
* యాదాద్రి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా తగ్గే వరకు ఊరికి రావద్దంటూ ఏకంగా ఆ ఊరి పెద్ద ఒకరు హుకుం జారీ చేశాడు. అయినా ఆ సెక్యూరిటీ గార్డు తన ఉద్యోగం మానేయలేదు. మరింత బాధ్యతగా తన విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా కట్టడిలో తన పాత్ర పోషిస్తున్నాడు.
* నగర శివారులో ఉంటున్న నాలుగో తరగతి ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైతే తొలుత ఓపికగా వివరించే ప్రయత్నం చేశాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పినా సరే స్థానికుల్లో మార్పు రాకపోవడం వల్ల చివరికి పోలీసులను ఆశ్రయించారు. వారు రంగంలోకి దిగి సర్దిచెప్పారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పక్కన ఉన్నవాడు చిన్నగా దగ్గితే భయపడే పరిస్థితి. అలాంటిది కరోనా బాధితులకు చికిత్స అందించే ఓ పెద్ద ఆసుపత్రిలో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు. తీరా తాము ఉంటున్న ప్రాంతాల్లో స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా భయపడేది లేదని.. తమకు ఉద్యోగ ధర్మమే ముఖ్యమని ముందుకు సాగుతున్నారు. కుటుంబ సభ్యులు.. ఇంట్లో పిల్లలను తలచుకుంటే మనసులో కొంత భయం వెంటాడుతున్నా సరే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విధుల్లో కీలకంగా ఉంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం.. రక్షణ.. పరిశుభ్రత.. తదితర పనుల్లో నిరంతరం దాదాపు 400 మంది కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు.
అన్నీ తామై..
బాధితులున్న వార్డుల ముందు రక్షణగా కాపలా ఉంటారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి తాగునీరు నుంచి ఆహారం, ఇతర అవసరాలను సమకూర్చుతూ నిత్యం అందుబాటులో పేషెంట్ కేర్ సిబ్బంది బిజీగా గడుపుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు అత్యంత క్లిష్టమైన విధుల్లో ఉంటారు. రోగులు ఉండే వార్డులు, శౌచాలయాలను నిరంతరం శుభ్రం చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడడం వీరి విధి. ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఇబ్బందులు తప్పవు. సమర్థవంతంగా సేవలు అందిస్తూ వీరంతా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు. వీరి రక్షణ కోసం వైద్యులు, నర్సుల మాదిరిగానే వీరికీ పీపీఈ కిట్లు అందిస్తున్నారు. వీరిలో కొందరికి రవాణా సౌకర్యాలు లేవు. ఆసుపత్రిలోని శివానంద ఆశ్రమంలోనే నివాసం ఉంటూ విధులకు హాజరవుతున్నారు.
ఎంతో కీలక విధుల్లో..
![Corona patients of fourth class employees in Gandhi provide excellent services in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6917962_gjjj.jpg)
ప్రస్తుతం ఆసుపత్రిలోని నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదో అంతస్తులు పూర్తిగా కరోనా బాధితులు, అనుమానితులతో నిండిపోయాయి. ఏడో అంతస్తులో పూర్తిగా ఐసోలేషన్‌తోపాటు ఐసీయూలు కొనసాగుతున్నాయి. ఎనిమిదో అంతస్తులో బాధితులు, అనుమానితులు ఉన్నారు. ఇక ఇతర అంతస్తుల్లో కరోనా బాధిత చిన్నారులు, మహిళలకు ప్రత్యేక వార్డులను కేటాయించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. వీరందరికీ చికిత్సలో కాదు.. ఇతర అనుబంధ సేవల్లోనూ సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య, పేషెంట్ కేర్ సిబ్బంది 24 గంటలపాటు సేవలు అందిస్తున్నారు. బాధితులు ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి వారికి పరీక్షలు పూర్తై వార్డుకు వెళ్లే వరకు ఓ కంట కనిపెడుతూ ఉంటారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ