రెండో దశ వెళ్లిపోయిందిగా.. ఇక ఏమీ కాదన్న నిర్లక్ష్యం.. కనీసం మాస్కు ధరించకపోవడం.. భౌతికదూరం పాటించే సంగతి అటుంచితే గుంపులుగా సంచరించడం.. శుభకార్యాలు, ఉత్సవాలు, అంత్యక్రియల్లో పాల్గొనడం.. వెరసి కరోనా మహమ్మారి (Corona Virus) మరోసారి కోరలు చాస్తోంది. హైదరాబాద్‌లో రెండో ఉద్ధృతి తర్వాత తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కేసులు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీల్లో 15 రోజుల క్రితం వరకు ఒకటీ రెండు తప్ప పెద్దగా కేసులు ఉండేవి కాదు. 10 రోజులుగా వాటి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మళ్లీ అప్రమత్తం కావాల్సిందే...
ఇది ఒక్క రాజధాని నగరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతోంది. కొవిడ్ నిబంధనలను జనం బేఖాతరు చేస్తుండటమే కేసుల పెరుగుదలకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇదే అలక్ష్యం కొనసాగితే మూడో దశ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్ రెండో దశ విజృంభించింది. ‘గాంధీ’తోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలూ దొరకక బాధితులు విలవిల్లాడారు.మార్చి నుంచి మే నెల వరకు రోజూ 1200-1800 మంది చేరేవారు. మే నెల నుంచి వైరస్ ఉద్ధృతి మెల్లమెల్లగా తగ్గింది. పూర్తిగా తగ్గిపోయిందన్న భావనతో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మాస్కులేవి?
హైదరాబాద్‌లో దాదాపు 40 శాతం మంది మాస్కులు ధరించడం లేదని పోలీసులు గుర్తించారు. ఫలితంగా నగరంలో 15 రోజులుగా చాప కింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు ‘గాంధీ’కి రోజుకు 10 కేసులు రాగా.. వారం రోజులుగా నిత్యం 30-40 వస్తున్నాయి. మంగళవారం 46 మంది, బుధవారం 32 మంది బాధితులు చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 361 మంది రోగులు ఉండగా.. ఇందులో 199 మంది కొవిడ్, 162 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు. రోజుకు 30 మంది డిశ్ఛార్జి అవుతుండగా.. అంతే సంఖ్యలో చేరుతున్నారు. టిమ్స్‌లో 50 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు పెరుగుతున్నారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కొవిడ్ ఉద్ధృతి సమయంలో నిత్యం 480 మంది చికిత్స పొందేవారు. తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గగా.. ప్రస్తుతం ఇక్కడ 80 మంది చికిత్స పొందుతున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 పడకల చొప్పున కేటాయింపు...
కరోనా తగ్గిందన్న ఉద్దేశంతో చాలా ఆసుపత్రుల్లో పడకలన్నీ సాధారణ రోగుల చికిత్సల కోసం కేటాయించారు. కొద్ది రోజులుగా రోగులు వస్తుండటంతో కొన్ని ప్రముఖ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం 50 పడకలను కేటాయిస్తున్నారు. అవసరమైతే వీటి సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా చూస్తే గాంధీ, టిమ్స్‌లలో మాత్రమే కరోనా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల వరకు కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ, సరోజినీదేవీ ఆసుపత్రుల్లోనూ కరోనా వైద్యం చేయగా.. ప్రస్తుతం సాధారణ రోగులకు చికిత్స ప్రారంభించారు. అవసరమైతే ఇక్కడా కరోనా రోగుల కోసం పడకలను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. మూడో దశలో పిల్లలకు సోకితే చికిత్స అందించడానికి నిలోఫర్‌లో వెయ్యి పడకలను సిద్ధం చేశారు.
కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే..
కరోనా రెండో ఉద్ధృతి తగ్గిన తరువాత గాంధీ ఆసుపత్రికి రోజూ 10 వరకు కేసులు వచ్చేవి. ఇప్పుడు 30కిపైగా కేసులు వస్తున్నాయి. మా దగ్గరకు వచ్చే 75 శాతం రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోంది. కరోనా, బ్లాక్‌ఫంగస్ రోగుల కోసం 400 పడకలు ప్రత్యేకంగా కేటాయించాం. అనేకమంది కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వపరంగా హెచ్చరికలు చేస్తున్నా అనేకమంది పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న ఆందోళన కలుగుతోంది.
-డాక్టర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్