రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున కరోనా వైరస్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసెంబ్లీ లాబీల్లో ఎవరు ఎదురుపడ్డా కరచాలనం వద్దంటూ పలువురు చేతులెత్తి నమస్కారం పెడుతూ వచ్చారు. శాసనసభ లాబీలోకి మంత్రి కేటీఆర్ వస్తూనే కరచాలనం వద్దు కరోనా ప్రభావం అంటూ నమస్కారం పెడుతూ వెళ్లారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇదే తరహాలో వ్యవహరించారు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్... కరోనాపై అందదరినీ అప్రమత్తం చేస్తూ కనిపించారు. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని... ఐసోలేషన్ వార్డును గాంధీ ఆసుపత్రి నుంచి మార్చే ఆలోచన లేదని ఈటల అన్నారు. కరోనాతో రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ వెయ్యి కోట్ల వరకు నష్టపోయిందన్న ఈటల... తనకు ఏడెనిమిది కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. ఒంట్లో వేడి ఉండే మనకెందుకు కరోనా వస్తుందని మాజీ మంత్రి నాయిని సహా మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి : 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం