ఇప్పటివరకు కొవిడ్-19ను గుర్తించేందుకు లక్షణాల ఆధారంగా రక్తం, కఫం (కళ్లె) నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు డాక్టుర్నల్ అప్లికేషన్‌ను వినియోగిస్తుండగా.. కరోనా వైరస్ నిర్ధారణకూ వినియోగించే దిశగా ప్రయత్నించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్).. నిర్వాహకులకు సూచించింది. దగ్గును రికార్డు చేసి, ఇతర లక్షణాలను యాప్‌లో నమోదు చేసి వ్యాధిని గుర్తించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సంస్థ నిర్వాహకులు తయారుచేశారు.
అయిదుగురితో ప్రారంభం..
క్షయ వ్యాధిని గుర్తించేందుకు డాక్టుర్నల్ సంస్థను రాహుల్ పత్రి, అర్పితాసింగ్, వైష్ణవిరెడ్డి, బాలకృష్ణ బగాడి, శేఖర్‌ఝా కలిసి 2016లో ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ వేదికగా ఈ అంకుర సంస్థ పనిచేస్తోంది. దగ్గుకు సంబంధించి 7 వేల శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి మెషిన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించారు. వీటి ఆధారంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు.సాఫ్ట్‌వేర్ రెండు రకాల్లో (వేరియంట్స్) అందుబాటులో ఉంది. మైక్రోఫోన్ సాయంతో పనిచేయడంతోపాటు స్మార్ట్‌ఫోన్ సాయంతో పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీని ద్వారా రోగి దగ్గు శబ్దాన్ని గుర్తించి.. క్షయనా?కాదా? చెబుతుంది.
దీనికి సంబంధించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ద్వారా థర్డ్‌పార్టీ క్లినికల్ పరిశీలన చేయించారు. 92 శాతం కచ్చితత్వంతో వ్యాధి గుర్తింపు జరుగుతోందని తేలింది. టీబీ అప్లికేషన్ ప్రజలకు నేరుగా అందుబాటులో లేదు. కేవలం పీహెచ్‌సీలు, ఆసుపత్రులు, టీబీ కేంద్రాలలో వైద్యులు పరిశీలించేందుకు అందుబాటులో ఉంచారు. ‘‘ఇప్పటివరకు 25 స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాం. టీబీతో పాటు సీవోపీడీ, ఆస్తమా, పీడియాట్రిక్, శ్వాసకోశ వ్యాధులను గుర్తించే వీలుంది. సులువైన పద్ధతిలో వ్యాధిని గుర్తించే పద్ధతి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే డాక్టుర్నల్ స్థాపించాం’ అని సంస్థ సీఈవో అర్పితాసింగ్ వివరించారు.
ఇవీ చూడండి: సీరియస్‌గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్