Telangana Covid Cases: కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో మరోమారు పెరుగుదల నమోదవుతోంది. 2020 నుంచి మూడు వేవ్‌లుగా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసింది. తొలి, రెండో వేవ్‌లలో తీవ్రరూపం చూపి వేలమంది ఉసురు తీసిన కొవిడ్ మూడో వేవ్‌లో అంత ప్రభావాన్ని చూపకపోవటం... వైరస్ బారినపడిన వారు సైతం కేవలం వారం రోజుల్లోనే కోలుకున్నారు. ఈ పరిస్థితుల్లో మహమ్మారి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రభుత్వాలు, ప్రజల్లో అలసత్వం కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరోమారు కొవిడ్ పంజా విసిరే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 7 తర్వాత తిరిగి మంగళవారం వందకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మహమ్మారి నాలుగో వేవ్ రూపంలో మరోమారు ముంచెత్తుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ ఏడాది జనవరిలో కొవిడ్ మూడో వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల ఆరోగ్యంపై తక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఐసోలేషన్ సమయాన్ని 14రోజుల నుంచి 7 రోజులకు తగ్గించింది. మహమ్మారి తీవ్రత తగ్గిందని... కేవలం సాధారణ జలుబు, జ్వరంలా కొవిడ్ వచ్చిపోతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఫిబ్రవరి నుంచి కొవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదవటం.. జనవరి 7 తర్వాత నిత్యం పదుల సంఖ్యలో మాత్రమే వైరస్ బారిన పడ్డారు. మార్చి తర్వాత రాష్ట్రంలో దాదాపు కొవిడ్‌కి ముందు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు మాస్కులను ఎప్పుడో మరిచారు. సానిటైజర్ మాట సరేసరి. ఒమిక్రాన్ కొత్త రూపాంతరం బీఏ 4 వేరియంట్ కాస్త వేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
తాజాగా 13,149 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 119 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటిలోనూ అత్యధికంగా 79 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే. మార్చి 7 తర్వాత ఇదే అత్యధిక సంఖ్య కావటం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,93,791కి పెరిగింది. వైరస్ నుంచి 7,89,022 మంది కోలుకోగా మరో 658 మంది మాత్రమే కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. కొవిడ్ కేసులు మరోమారు పెరుగుతున్న వేళ ప్రజలు తప్పక కొవిడ్ నిబంధనలు పాటించాలని.. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఇవీ చదవండి: