రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 30 రోజుల్లో దాదాపు 28 లక్షల పరీక్షలు జరిగాయి. వారిలో 1.73 లక్షల మందికి పాజిటివ్ అని తేలింది. ఏప్రిల్ 9 నాటికి 1.08 కోట్ల పరీక్షలు జరిగితే నెల రోజుల్లో ఆ సంఖ్య 1.36 కోట్లకు చేరింది. అదే సమయానికి 3.24 లక్షల పాటిజివ్ కేసులు ఉంటే తాజాగా బాధితుల సంఖ్య 4.97 లక్షలైంది. రెండోదశ విస్తృతమైన తర్వాత మరణాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరమవుతుండగా... ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు భారీగా నిండుతున్నాయి. ఓ వైపు పడకల సామర్థ్యం పెంచుతున్నప్పటికీ ఆ మేరకు చేరికలూ పెరుగుతున్నాయి. నెల రోజుల పరిస్థితి గమనిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల్లో చేరికలు 1,662 నుంచి 14వేల335కి పెరిగాయి. ఐసీయూలలో 979 నుంచి 8వేల 357కి చేరాయి. చికిత్స పొందుతూ నెల రోజుల్లో 987 మంది చనిపోయారు. గత నెల 9 నాటికి 1,752 మరణాలుంటే ఇప్పుడు 2,739కి చేరాయి.
తగ్గిన పరీక్షల సంఖ్య
మరోపక్క వివిధ కారణాలతో పరీక్షల సంఖ్య గత కొంత కాలంగా తగ్గుతోంది. కేంద్రాల్లో కొవిడ్ నిర్ధరణ కోసం వెళ్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఎక్కడికక్కడ సంఖ్యకు పరిమితి పెట్టుకొని పరీక్షలు నిర్వహించడంతో చాలామంది వెనక్కు వెళ్తున్నారు. కొందరు ప్రైవేటులో పరీక్షలు చేయించుకొంటున్నారు. మరోవైపు డిమాండ్ మేరకు కరోనా టీకాలు అందుబాటులో లేవు. గతంలో తొలి డోసు తీసుకున్న 13 లక్షల మందికి ఈనెలలోనే రెండోది ఇవ్వాల్సి ఉంది. నిల్వలు సరిగా లేకపోవడంతో ఈనెల 15 వరకు రెండో డోసు వారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో ఒక్కో రోజు లక్షకు పైగా టీకాలు వేశారు. ఏప్రిల్ 23న ఆ సంఖ్య తొలి, రెండోడోసు కలిపి 2 లక్షలుగా ఉంది. ఆ తర్వాత రోజువారీ పంపిణీ గణనీయంగా తగ్గింది. ఈనెల 8న కేవలం 81 వేల మందికే ఇచ్చారు.
ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి