కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్‌కు చెందిన మక్తల ఫౌండేషన్ ఛైర్మన్ జలంధర్ గౌడ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తన సొంత ద్విచక్ర వాహనానికి బ్యానర్లు కట్టించి, మైక్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు లేనివారికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.
నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం వల్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జలంధర్ తెలిపారు. జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ తనవంతుగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యక్తిగత శుభ్రత, స్వీయ నియంత్రణ, శానిటీజర్స్ వాడకం అవసరమని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే పౌష్టిక ఆహారాన్ని తీసుకొని రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలని జలంధర్ వివరించారు.