ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు జరిమానాలు విధించడం మనం చూస్తుంటాం... పగటి వేళల్లో ఎక్కువగా ఉల్లంఘనలు జరుగుతుంటాయి. అయితే అర్ధరాత్రి వేళ ఎవరుంటారు.. రోడ్లన్నీ మనవే అనుకునేవారికి ఓ షాకింగ్ వీడియో చెమటలు పట్టించింది. నిఘానేత్రంలో పహారా కాస్తున్న పోలీసుల హెచ్చరికతో దిమ్మతిరిగిపోయింది. వామ్మో ఇదేంట్రాబాబు.. నడిరోడ్డుపై ఫోటో తీసుకుంటుంటే ఎక్కడి నుంచి చూస్తున్నార్రాబాబు.. ఈ ఫోటోలు వద్దు.. ఏమీ వద్దంటూ ఆ వ్యక్తి వెళ్లిపోతున్న ఘటన నవ్వులు పూయిస్తుంది.
రాత్రి సమయాల్లో పోలీసులు అంతగా పట్టించుకోరులే అనుకుని వాహనదారులు దూసుకుపోతుంటారు. అలా చేస్తే మీకు చలాన్ పడినట్లే. భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో ఉన్న సీసీకెమెరాలు 24 గంటల పాటు మీ ప్రతి కదలికను రెప్పవేయకుండా గమనిస్తుంటాయని మరచిపోవద్దు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. మాదాపూర్‌లో నిర్మించిన తీగల వంతెనపై వాహనాలు ఆపి ఫోటోలు దిగడం నిషేధం. రెండు రోజుల క్రితం ఓ ద్విచక్ర వాహనదారుడు వంతెనపై బండి ఆపి స్నేహితులతో కలిసి ఫోటోలు దిగేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు వంతెన పై వాహనాలు ఆపొద్దు.. అక్కడినుంచి వెళ్లిపోండని మైకులో హెచ్చరించారు.
ఇదీ చూడండి: Viral: చటుక్కున పరుగెత్తి ప్రాణాలు రక్షించుకొని!
ఉలిక్కిపడిన ఆ వాహనదారుడు వామ్మో ఈ ఫోటోలు వద్దు ఏమీ వద్దు.. చలానా వేయకండి వెళ్లిపోతున్నా అంటూ పరుగందుకున్నాడు. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజికమాధ్యమాల్లో పోస్టు చేశారు. పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు. ఎలాంటి చలాన్ విధించలేదు. ఇప్పుడీ వీడియో నవ్వులు పూయిస్తోంది.
ఇదీ చూడండి: సెలూన్‌లోకి అనుకోని అతిథి- గంటసేపు మేకప్!