ఉపాధిహామీ నిధులతో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో లక్ష కల్లాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్థికశాఖల సమన్వయ సమావేశంలో కల్లాల నిర్మాణంపై చర్చించారు. మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు భారీగా పెరుగుతున్నందున కల్లాల నిర్మాణం అవసరమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు రోడ్లను ఉపయోగించుకుంటున్నారన్న మంత్రులు.. కల్లాల నిర్మాణంతో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. 45 సెంటీమీటర్ల ఎత్తు, 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కల్లాల్ని నిర్మించాలని .. ఒక్కో ఫ్లాట్ ఫామ్ నిర్మాణానికి 46వేల45 రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద వీటిని చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. కల్లాల నిర్మాణాలకు ఆమోదం కోసం మంత్రులు ప్రతిపాదనలు పంపారు.
ఇదీ చదవండి: ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు