Home Construction Cost increased: సొంతింటి కల రోజురోజుకీ ప్రియంగా మారుతోంది. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రి ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. స్టీలు ధరలు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. ఇసుక ధర దాదాపు రెండింతలైంది. నాలుగేళ్లలో అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఏడాది ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంది. వెరసి సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న కలను సాకారం చేసుకోవడం కష్టంగా మారింది. మరోవైపు అపార్టుమెంట్లలో ఫ్లాట్ల ధరలూ పెరిగిపోతున్నాయి. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఈ ఏడాది వ్యవధిలో 25 నుంచి 45 శాతం పెరిగాయి. సిమెంటు, స్టీలు, ఇసుక, విద్యుత్తు కేబుల్స్, తలుపులు, కిటికీలకు బిగించేందుకు వాడే మేకుల ధరలూ పెరిగాయి. కరోనాతో నిలిచిపోయిన నిర్మాణరంగం అయిదారు నెలల నుంచి పుంజుకుంటోంది. అయితే తయారీదారులు కుమ్మక్కవుతూ తరచూ సిమెంటు ధరలను పెంచుతున్నారు. అంతర్జాతీయంగా స్టీలు ఉత్పత్తి తగ్గటంతో డిమాండు పెరిగింది. రాష్ట్రంలో చాలినంతమంది కూలీలు లభించకపోవటంతోపాటు ఇక్కడ ఛార్జీలు అధికంగా ఉండటంతో బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అడుగుకు రూ.200లకుపైగా భారం..
నిర్మాణ ఉత్పత్తుల ధరలు పెరగటంతో గడిచిన ఏడాదిలో అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు రూ.200 వరకు ధర పెరిగింది. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు పడకల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే రూ.10 నుంచి రూ.12 లక్షలకుపైగా అదనపు భారం పడుతోంది. ఇతర సదుపాయాల ధరలనూ నిర్మాణదారులు పెంచుతున్నారు. అదే 150 చదరపు గజాల విస్తీర్ణంలో 1,200 చదరపు అడుగల ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించుకోవాలంటే నిర్మాణవ్యయం ఏడాది వ్యవధిలో రూ.పది లక్షలకుపైగా పెరిగింది. అపార్టుమెంట్ల నిర్మాణదారులకు సరఫరా చేసే ఉత్పత్తుల ధరలతో పోలిస్తే సొంతంగా ఓ ఇల్లు కట్టుకునే వారికి ఇచ్చే ధరలు పది నుంచి 15 శాతం అదనంగా ఉండటం కూడా భారం పెరగటానికి కారణం.
మోయలేని విధంగా జీఎస్టీ భారం...
నిర్మాణ రంగంపై ప్రభుత్వం విధించిన జీఎస్టీ భారం భారీగా ఉంది. నిర్మాణ ఉత్పత్తుల్లో అధిక శాతం వస్తువులకూ, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వారికీ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఫ్లాట్ కొనుగోలుపై జీఎస్టీ అయిదు శాతముంది. ఇండిపెండెంట్ ఇల్లు అయినా..ఫ్లాట్ అయినా అన్నింటిపై అయిదు నుంచి పది శాతం లోపే జీఎస్టీ విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కేంద్రం ఎలా స్పందిస్తుందో ఇంకా స్పష్టత లేదు.
పెరిగిన ధరలతో అల్లాడుతున్నాం..
పాత ఇంటిని పడగొట్టి జనవరి 2020లో పనులు ప్రారంభించాం. ఇప్పటికి ముప్పావువంతే పూర్తి అయింది. కరోనా, పెరుగుతున్న భవన నిర్మాణ సామాగ్రి ధరలతో అల్లాడిపోతున్నాం. అనుకున్న బడ్జెట్ పెరిగిపోయింది. అంచనా డబ్బు శ్లాబులకే సరిపోయింది. బ్యాంకు రుణం తీసుకుని కొంత పూర్తి చేయించాం. అదీ చాలక బంగారు నగలను బ్యాంకులో తనఖా పెట్టాం. ఇంకా పనులు మిగిలి పోయాయి. పెద్దలు చెప్పినట్లు ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ సామెత గుర్తొచ్చింది. నా ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేసినప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. - మొగిలి జనార్దన్, హైదరాబాద్
నిర్మాణాలు తగ్గుతున్నాయి...
సొంత పర్యవేక్షణతో ఇల్లు కట్టుకోలేనివారు మాకు కాంట్రాక్టుకు ఇస్తుంటారు. ఇదివరకు చదరపు అడుగు రూ.1,450కి చేసేవాళ్లం. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇప్పుడు రూ.1,600 తీసుకుంటున్నాం. మేం కూడా జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. ఇసుక ధరలు స్థిరంగా ఉన్నా. ఇటుక ధర పెరుగుతోంది. ప్లంబింగ్ వస్తువుల ధరలు బాగా పెరిగాయి. గతంలో ఏడాదికి ఎనిమిది నుంచి పది ఇళ్లు కట్టేవాడిని. ప్రస్తుతం ఆ సంఖ్య అయిదారుకు పడిపోయింది. - ముంజి గోవిందరావు, గుత్తేదారు, మల్లాపూర్
వెనకడగు వేస్తున్న సామాన్యులు..
ఏడాదికాలంగా నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే పెరిగిన ధరలతో వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. స్టీలు టన్ను ధర ఏడాది కిందట రూ.48 వేలు ఉంటే రూ.70 వేల వరకు పెరిగి ఆ తర్వాత కొంత తగ్గింది. ఎలక్ట్రిక్, కాపర్ వస్తువులు 40 శాతం, సిమెంటు 30 శాతం పెరిగాయి. ఇటుక ధర గతంలో రూ. 7 ఉండేది. ప్రస్తుతం రూ.9.50. ప్రస్తుతం మార్కెట్‌ను పీడిస్తున్న ప్రీసేల్స్, యూడీఎఫ్ పథకాలతో తీవ్ర నష్టం జరుగుతోంది. - ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, వెస్ట్‌జోన్ బిల్డర్స్ ఫెడరేషన్
ఇదీ చదవండి: మనుషులకే కాదు.. దేవుళ్లకూ చలి! అందుకే ఈ ప్రత్యేక ఏర్పాట్లు!!