Priyanka Gandhi at Hyderabad Congress meeting: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా పార్టీలు సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా యువతకు భరోసా కల్పించేట్లు డిక్లరేషన్ సిద్దం చేసింది. గత కొంతకాలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారంపై అన్ని విధాల పోరాటం చేస్తున్న కాంగ్రెస్.. యువతను ఆకట్టుకోడానికి మరిన్ని కార్యక్రమాలు చేస్తోంది.
ఇటీవల జిల్లాల్లో పర్యటించిన రేవంత్రెడ్డి బీఆర్‌ఎస్, బీజేపీ పాలనతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని విమర్శలు చేశారు. యువతను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. యువతను అన్ని విధాల ఆదుకోవడం ద్వారా.. పార్టీకి దగ్గర చేసుకోవాలనే దిశలో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ మాదిరి హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఇవాళ జరగనున్న సభలో ప్రియాంక గాంధీ ద్వారా యువ డిక్లరేషన్ ప్రకటన సిద్దం చేసింది.
Hyderabad Congress meeting today: కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. డిక్లరేషన్‌లో మొదటి ప్రాధాన్యత అమరవీరుల కుటుంబాలకు ఇవ్వగా.. తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇస్తారు. ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25వేలు పింఛన్, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
బిస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం ఖాళీలున్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇస్తున్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ కారణంగా విద్యార్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటన చేస్తారు. యువతకు ఉపాధి కల్పన దిశలో మరికొన్నిఅంశాలు కూడా డిక్లరేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
షెడ్యూల్ ఇదే..: మొదటి సారి తెలంగాణకు వస్తున్న ప్రియాంకా గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆమె పర్యటనను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి సరూర్ నగర్ స్టేడియం చేరుకుంటారు.
బేగంపేట నుంచి సరూర్ నగర్ స్టేడియం వద్దకు హెలికాప్టర్ ద్వారానా, రోడ్డు మార్గాన అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఎల్బీనగర్ చౌరస్తా వద్ద శ్రీకాంతచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. అక్కడి నుంచి వాహనంలో సరూర్ నగర్ స్టేడియం చేరుకుంటారు. సభ ముగిసిన తర్వాత బేగంపేట నుంచి స్పెషల్ విమానంలో దిల్లీకి వెళ్లతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి మినిట్ టు మినిట్ పర్యటన అధికారికంగా వచ్చినా.. వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు.
ఇవీ చదవండి: