Telangana Congress Latest News : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షత వహించగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. 35 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మెరుగుపడాలని.. పార్టీ ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పినట్లు సమాచారం. 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్షణం బలమైన అభ్యర్థులను గుర్తించి.. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది.
Congress Telangana Assembly Election Plan : వచ్చే ఎన్నికల్లో.. విజయానికి అనుసరించాల్సిన ప్రణాళికపై సునీల్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సర్వేల్లో వెల్లడైన సమాచారం ఆధారంగా పార్టీ పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. 35 స్థానాల్లో మరింత గట్టిగా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. చర్చ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీసీలకు సీట్ల విషయం ప్రస్తావించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు స్థానాలు.. అంటే 34 సీట్లని బీసీ అభ్యర్థులకు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Telangana Congress 100 Days Plan : రాబోయే 100 రోజులు ప్రచారం హోరెత్తించాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. బహిరంగ సభలు, హామీలపై అగ్రనేతలతో డిక్లరేషన్ల విడుదల, రాష్ట్ర ముఖ్య నేతలతో బస్సు యాత్ర వంటి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. ఎన్నికల్లో ప్రచారం ఎలా నిర్వహించాలి, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై చర్చించారు. చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ర నేతలతో భారీ బహిరంగ సభ నిర్వహణ, అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీల రూపకల్పనపై కమిటీలో చర్చించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ సీనియర్ నాయకురాలినైనా తాను ఫోన్ చేస్తే కొందరు ముఖ్యులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం.
మరోవైపు.. ఈ నెల 30న కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని.. మధుయాష్కీ, షబ్బీర్ అలీ వెల్లడించారు. వచ్చే నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గర్జన సభ జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4016 పింఛను ఇస్తామని ప్రకటించడం.. కాంగ్రెస్ ఇచ్చిన హామీతో లభించిన విజయంగా నేతలు అభివర్ణించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ, మహిళా డిక్లరేషన్ల రూపకల్పనకు ఉప కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అసలు నైజాన్ని క్షేత్రస్థాయిలో ఎండ గడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..:
Bhatti on Telangana Governament : 'రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కనీస వేతన బోర్డు సమీక్ష చేయలేదు'