పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే తన ప్రాణాలను సైతం లెక్కచేయనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హెచ్చరించారు. ఏప్రిల్ 14వ తేదీలోగా విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే ఛలో పంజాగుట్టకు పిలుపునిస్తామని ఆయన వెల్లడించారు. రాజ్యాంగం రాసిన మహనీయుని పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదని అన్నారు. హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోర్ కమిటీ సమావేశం పెట్టాలి:
విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వంతో యుద్ధం కొనసాగుతుందని వి.హనుమంతరావు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకమని ఆరోపించారు. తెరాస నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా గ్రామగ్రామాన ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే స్వేచ్చలేదని ఆక్షేపించారు. విగ్రహ ఏర్పాటుపై పీసీసీ కోర్ కమిటీ సమావేశం పెట్టాలని ఉత్తమ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం పెట్టడం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. అందుకే ఆయన రాసిన రాజ్యాంగంతోనే లోక్‌సభ, అసెంబ్లీ నడుస్తున్నాయి. ఇలా ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనను అవమానిస్తారు. ఏప్రిల్ 14 వ తేదీలోగా విగ్రహం ఏర్పాటు చేయకపోతే ఛలో ట్యాంక్‌బండ్ కాదు ఛలో పంజాగుట్టకు సిద్ధం. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చివరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయను. -వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత