Congress protest: రాష్ట్రంలో ఆందోళనకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ధరల పెరుగుదలకు నిరసన, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీన ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌తో 12వ తేదీన టీపీసీసీ బృందం భేటీ కానుంది. గ్రామాలలో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిపించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అదే విధంగా ఈ నెల 15నుంచి 20వ తేదీ వరకు పార్టీ ముఖ్య నాయకులతో కూడిన బృందాలు గ్రామాల్లో పర్యటించనున్నారు. పంటపొలాలు, కొనుగోలు కేంద్రాల పరిశీలన రైతులతో చర్చలు రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివరి వారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటనకు రానున్న సందర్భంగా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు నాయకులంతా కలిసి పని చేయాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. తొలి రోజు వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. మరుసటి రోజు హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Addanki Dayakar Compalint: 'అధిష్ఠానానికి ఆ ముగ్గురి నేతలపై ఫిర్యాదు'