హైదరాబాద్ ఆదర్శ్ నగర్‌లోని కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వరకు కాగడల ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
అయితే నిరసనకు అనుమతి లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ కుమార్‌లను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా చేపట్టనున్న ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వరని పోలీసులతో పార్టీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు కేవలం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు అనుమతి ఇచ్చాక... అక్కడివరకు కాంగ్రెస్ నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ బిల్లు... దేశ రైతాంగానికి మరణ శాసనమేనని అంజనీ కుమార్ ఆరోపించారు. అన్నదాతలను పెట్టుబడిదారుల బానిసలుగా మార్చడమేనని... కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సి వస్తుందన్నారు.
ఇదీ చదవండి: 'ప్రార్థనా మందిరాలు కూల్చివేయడంపై కాంగ్రెస్ ఫిర్యాదు'