హైదరాబాద్ ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల నిర్వహణ కోసం నియోజకవర్గాల వారీగా నియమించిన 119 మంది సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ భేటీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, అంజన్ కుమార్ యాదవ్, అజ్మతుల్లా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత కల్పన అకాల మరణంతో... ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. నేతలంతా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సమన్వయకర్తలు చేయాల్సిన కార్యక్రమాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌లు దిశానిర్దేశం చేయనున్నారు.
అదేవిధంగా స్థానిక నాయకులతో నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ కర్తలు ఎలా సమన్వయం చేసుకోవాలో.. అనే పలు అంశాలపై వివరిస్తారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభల గురించి జనంలో ఏ విధంగా అవగాహన కల్పించాలో కూడా వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: TRS MLAs : రేవంత్‌పై తెరాస ఫైర్.. బాలరాజు, జీవన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్