రాష్ట్రంలో పురపాలక, నగరపాలక ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అధిక స్థానాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేయ్యాలని... అధిష్ఠానం ఆదేశించడంతో నాయకులంతా ఆ దిశలో శ్రమిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. తమ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో అధిక స్థానాల్లో గెలుపొంది అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. లేదంటే పీసీసీ రేసులో వెనుకబడి పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ తెరాస, భాజపాను ఎలా ఎదురుకోవాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
'పీసీసీ పదవి కావాలంటే... అధిక స్థానాలు గెలవాల్సిందే' పదవి పొందాలని... మల్కాజిగిరి లోకసభ పరిధిలోని పురపాలిక, నగరపాలిక సంస్థలతోపాటు కొడంగల్ పురపాలక సంఘం బాధ్యతలను కూడా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ అప్పగించింది. అధిక స్థానాలను గెలిపించి తన సత్తా చాటేందుకు రేవంత్‌రెడ్డి రాత్రి పగలూ కష్టపడుతున్నారు. భువనగిరి లోకసభ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థల బాధ్యతలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మునిసిపాలిటీలను గెలిపించుకునే బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. ఎక్కువ స్థానాలు గెలిపించి ఏఐసీసీ పదవి పొందాలని ఉత్తమ్ ఆశిస్తున్నారు. గెలిపించే బాధ్యతను తీసుకుని... ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యతను మీదేసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే మకాం వేసి విస్తృతంగా పర్యటిస్తూ... కార్యకర్తల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పురపాలక, నగరపాలక సంస్థలను దక్కించుకోడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను తీసుకొని అక్కడ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోడానికి కృషి చేస్తున్నారు. అధిక స్థానాలు గెలిచి అధిష్ఠానం దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. ఇవీ చూడండి: 'పురపోరుకు నేడే నోటిఫికేషన్..!'