రాజకీయ లబ్ధి కోసమే తెరాస, భాజపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలనే ధాన్యంపై నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వానాకాలం పంట కొంటామని కేంద్రం ముందే చెప్పిందని దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
ప్రధాని మోదీకి మద్దతిచ్చేందుకే పార్లమెంట్ సమావేశాలను తెరాస బహిష్కరించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన సమావేశంలో యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని తెరాస ఎంపీలు కోరలేదన్న రేవంత్... యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని అడగకుండా వానాకాలంలో ఎంత కొంటారో చెప్పాలనడం దారుణమన్నారు. ఏప్రిల్‌లో వచ్చే పంట కొనుగోలే రైతులకు అసలు సమస్య అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అవినీతి చేశారంటూ కేంద్రమంత్రి అమిత్ షా....రాష్ట్ర భాజపా నేతలకు చెప్పారని... అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పాలని తెరాస మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమన్న రేవంత్ రెడ్డి...ఇప్పటికే పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు.
'తెలంగాణ ప్రజల్లో తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహకర్త సునీల్ సూచనలతో భాజపా, తెరాస ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. సునీల్ సూచనలతోనే ధాన్యం అంశాన్ని అడ్డం పెట్టుకుని కొట్టినట్లు చేయు.. ఏడ్చినట్లు చేస్తానంటూ ఆ రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారు. సునీల్‌కు అమిత్‌షాతో ఉన్న సంబంధమేంటి? గతంలో ఆయన ఎవరితో పనిచేశారు? తదితర విషయాలన్నీ త్వరలో హైదరాబాద్‌లో వెల్లడిస్తా.'
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
'రైతులు బలవుతున్నారు'
రాజకీయ వ్యూహకర్త చక్రబంధం.. తెరాస, భాజపా రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలి అవుతున్నారని రేవంత్ ఆరోపించారు. తెరాస ఎంపీల పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలను వదిలేసి పారిపోయి మళ్లీ దిల్లీ వచ్చి నాటకాలు ఆడుతున్నారని... అమిత్‌షా డైరెక్షన్‌లో కేసీఆర్ నటిస్తున్నారని విమర్శించారు. ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతి
ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గత రబీలో 52లక్షల ఎకరాల్లో వరి పండిస్తే ఈసారి వరి వేయొద్దనంటున్నారని మండిపడ్డారు. ఒకే ఏడాదిలో పంట మార్పిడి సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. వరిపై ఆంక్షలు పెట్టకుండా ఏవిధంగా దాన్ని మార్కెటింగ్ చేయాలనేదానిపై ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో అవినీతి జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై భాజపాలో చర్చ జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై సీబీఐ, సీవీసీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
'గతేడాది 52 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఈ ఏడాది నుంచి వరి పండించొద్దంటే ఎలా? వరి పంటపై ఆంక్షలు వేయకుండా ఎగుమతులపై దృష్టిపెట్టాలి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచే అంశంపై అడిగాం. రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం చెప్పింది. గిరిజనులకు కేసీఆర్ మోసం చేస్తున్నారని స్పష్టం అవుతుంది.'
-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
'కమీషన్ల కోసమే ఆ పథకాలు'
ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని... కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ అన్ని నాటకాలడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గండిపోచమ్మ ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 400 ఎకరాలకే నీరు వెళ్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలను కమీషన్ల కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమంటూ దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తోందని అన్నారు.
ఇదీ చదవండి: Harish rao comments on Piyush Goyal: 'రైతులకు పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి'