హైదరాబాద్‌కు ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న రేవంత్.. వందల ఏళ్ల క్రితమే నిజాం నవాబు సెజ్‌లను నెలకొల్పారన్నారు. పూలగుత్తి లాగా హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలను నిజాం పాలకులు సమకూర్చారని పేర్కొన్నారు. కట్టడాలు, పెట్టుబడులు ద్వారా హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దారన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాయంతో నగర ప్రణాళిక రూపొందించారని గుర్తుచేశారు.
నిజాం పాలకులు దాదాపు 4 వేల చెరువులను నిర్మించారని... వాటన్నింటిని ధ్వంసం చేసినా పాలకులు పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరదలు వస్తే ప్రకృతిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
వందల ఏళ్లలో ఎన్ని ఆక్రమణలు జరిగాయో.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఆక్రమణలు జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంచినీటి చెరువులను కూడా ఆక్రమించారని మండిపడ్డారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నాణ్యమైన విద్యుత్ 7 నుంచి 8 గంటలు ఇచ్చినా చాలన్నారు.
ప్రజలకు విజ్ఞప్తి..
రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు వినిపించే అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు అధికారం కట్టబెట్టాలని కోరారు. లేకుంటే కనీసం ఓ ముప్పై సీట్లైనా ఇవ్వాలని.. గ్రేటర్లో అద్భుతాలు చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగంతో తెరాస, భాజపా ఆట్లాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
భాజపాకు అధికారం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అడుగుతున్నారని.. మోదీ చేయలేని పని మేయర్ చేస్తారా.. అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. తీసుకురావడం లేదన్నారు.
కర్ఫ్యూ ఎక్కడుంది..
కాంగ్రెస్, భాజపా పార్టీలు గెలిస్తే.. కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తుతాయని కేటీఆర్ అంటున్నారని.. ఇరవై ఏళ్లలో ఒక్కసారైనా కర్ఫ్యూ వచ్చిందా అయినా ప్రశ్నించారు.
తెరాసకు ప్రచారం చేస్తా!
గ్రేటర్ పరిధిలో లక్ష రెండు పడక గదుల లబ్ధిదారుల వివరాలు ఇస్తే.. కాంగ్రెస్ అభ్యర్థులకు తెరాస కండువా వేసి ప్రచారం చేస్తానని.. తానే స్వయంగా కేటీఆర్ వెనుక ప్రచారానికి వెళ్తానన్నారు.. రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో పది లక్షల ఉద్యోగాల ఇచ్చానంటున్నారని.. కనీసం లక్షమంది వివరాలు ఇస్తే.. ఎన్నికల అనంతరం ప్రగతిభవన్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: బల్దియా పోరులో బ్యాలెట్ పోలింగ్.. నేతల గుండెల్లో గుబులు రేపెన్!