Congress MLA Candidates List Telangana 2023 : రాబోయే శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections 2023)కు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు వెయ్యి ఆరు దరఖాస్తులు అందగా.... ఇప్పటికే, ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలన పూర్తి చేసి, స్క్రీనింగ్ కమిటీకి నివేదిక అందజేసింది. ఈ మేరకు రెండ్రోజులుగా స్క్రీనింగ్ కమిటీ పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమై, అభిప్రాయాలు స్వీకరించింది. ఈ నెల 4న ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్.. నిన్న డీసీసీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతరాత్ర నేతలతో విడివిడిగా సమావేశమై, అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తమ పరిధిలో పార్టీ స్థితిగతులను, ఇతర పార్టీల బలాలను రాతపూర్వకంగా నివేదించారు. అటు.. ప్రదేశ్ ఎన్నికల కమిటీలో లేని సీనియర్ నేతలతోనూ మురళీధరన్ వేర్వేరుగా భేటీ అయ్యారు.
Telangana Congress MLA Candidates Selection : టికెట్ల కేటాయింపులో కొత్త వారికి అవకాశాలు, అలాగే, అభ్యర్థుల ఎంపికలో సర్వేలే ప్రామాణికంగా తీసుకోకుండా పార్టీకి విధేయులుగా ఉన్న వారిని విస్మరించకుండా చూడాలని.. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తొలుత టికెట్లు ప్రకటించాలని పలువురు సీనియర్ నేతలు స్క్రీనింగ్ కమిటీకి విన్నవించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జానారెడ్డి.. మురళీధరన్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులను వివరించటంతో పాటు పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసే అంశాలపై పలుసూచనలు చేసినట్లు తెలుస్తోంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టికెట్లు ముందుగానే ప్రకటించేలా చూడాలని సీనియర్ నేతలు కోదండరెడ్డి, నిరంజన్‌లు వినతీపత్రం అందజేశారు. సర్వేల ఆధారంగానే అభ్యర్ధుల ఎంపిక అనేది సరైంది కాదని.. అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలని మరికొందరు నేతలు కోరినట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపికలో ప్రలోభాలకు గురవటం, సరైన విధానాన్ని అనుసరించలేదనే విమర్శలు వస్తే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని మరికొందరు నేతలు సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Congress MLAs List 2023 : మరోవైపు.. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు.. స్క్రీనింగ్ కమిటీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గంటపాటు వివరించిన ఆయన.. పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది.. వెనకబడిన నియోజకవర్గాల్లో పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ ఆశించిన మేర బలంగా లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. త్రిముఖ పోటీ కారణంగా ఉత్తర తెలంగాణాలో చాలా చోట్ల సీనియర్ నేతలు సైతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సునీల్ కనుగోలు వివరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆశించిన మేర పార్టీ బలంగా లేదన.. దక్షిణ తెలంగాణాలో మాత్రం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వివరించినట్లు సమాచారం. ఆర్నెళ్లుగా మారుతున్న పరిణామాలను మురళీధరన్ ముందుంచిన సునీల్ కనుగోలు.. కర్ణాటక ఫలితాల తర్వాత పార్టీ పుంజుకున్న తీరును గణాంకాలతో సహా వివరించారని తెలుస్తోంది. కాగా.. నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కల్గించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం.
Telangana Assembly Elections 2023 : అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యుడు బాబాసిద్ధిఖీ.. రెండ్రోజుల పాటు అభిప్రాయసేకరణ పూర్తిచేసి.. నేతల అభిప్రాయాలు, వినతీపత్రాల్లోని సమాచారాన్ని క్రోడీకరించి ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుండగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొంటారు.
ఆ ఏరియాలో వారి బలాబలాలు: ప్రదేశ్ ఎన్నికల కమిటీ అర్జీదారులను వడబోసి.. మూడేసి పేర్లతో చేసిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. ఒకే దరఖాస్తు వచ్చిన చోట పెద్దగా పరిశీలన చేయాల్సిన అవసరం లేకున్నా.. రెండు, అంతకంటే ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో బలాబలాలు, సర్వేనివేదికలు, పనితీరు ఆధారంగా అర్హులైన వారికే టికెట్లు వచ్చేలా స్క్రీనింగ్ కమిటీ పనితీరు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ