ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. డీడీ కాలనీలో కబ్జాలకు గురవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ భూములను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని సీనియర్ నేతలు పరిశీలించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఓయూ భూముల పరిరక్షణ కోసం గవర్నర్‌ను కలుస్తామని ఉత్తమ్ అన్నారు.
''తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేసి... ప్రైవేటు వాటిని ప్రోత్సహించడం చాలా బాధాకరం. ఓయూ స్థాపించేటప్పుడు 1600లు ఎకరాలు ఉండేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా ఉస్మానియా విస్తీర్ణం తగ్గిపోతుంది.''
ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
తప్పుడు పత్రాలతో అనుమతులకు ప్రయత్నాలు..!
వర్సిటీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని మేయర్ బొంతు రామ్మోహన్‌కు.. ఓయూ రిజిస్ట్రార్, ఉప కులపతి విజ్ఞాపన పత్రం అందజేశారు. తప్పుడు పత్రాలు చూపుతూ విశ్వవిద్యాలయం భూముల్లో 9 మంది నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు కోరుతున్నారని ఆరోపించారు.
తులసి కో-ఆపరేటింగ్ సొసైటీకి, ఉస్మానియా వర్సిటీకి మధ్య ఏర్పడిన స్థల వివాదంలో సుప్రీంకోర్టు 4,800 చదరపు గజాల స్థలాన్ని సొసైటీకి ఇచ్చినట్లు తెలిపారు. అయితే మరో 9 మంది వ్యక్తులు అదే సొసైటీతో కుట్రపూరితంగా తప్పుడు పత్రాలు సృష్టించి ఓయూ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై మేయర్ స్పందించారు. ఈ అంశంపై తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మేయర్ సూచించారు.
ఇవీ చూడండి: కొత్తది కొనలేం.. పాతది పాడైతే బాగు చేయించలేం...!