హైదరాబాద్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కోటి జనాభా భయపడుతోందన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలు అవస్థలు పడుతున్నారని హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలిపారు.
నగరంలోని గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, ఫీవర్ హాస్పిటల్‌లలో పరిస్థితి దారుణంగా ఉందని.. ఆ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కేసీఆర్ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానని... దోఖా సిటీగా మార్చారని విమర్శించారు.
గత నాలుగు నెలలుగా విద్యుత్ బిల్లులు భారంగా మారాయన్నారు. హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ వస్తుందని ప్రజలు భయపడుతున్నారని అంజన్ కుమార్ తెలిపారు. త్వరలో బోనాల పండుగ వస్తుందని... లాక్‌డౌన్ నిబంధనల మేరకు అనుమతివ్వాలని కోరారు.
కరోనా నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ విమర్శించారు. నాణ్యమైన కిట్స్ ఇవ్వకపోవడం వల్లే డాక్టర్లు, పోలీసులు కరోనా బారిన పడుతున్నారని ఆరోపించారు. గాంధీ ఆసుపత్రిని అభివృద్ది చేసినట్లయితే.. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆ హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లలేదని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం