Protests by Congress Ranks Across the State: కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతోనే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిల్లీలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా క్షుణ్నంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనం కిందికే వస్తుందని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపైనే ఈ దాడులకు పాల్పడ్డారని, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సునీల్ కనుగోలు కార్యాలయంలో తనిఖీలను నిరసిస్తూ... కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో నాయకులను పోలీసులు గృహనిర్భందం చేశారు. జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు గాంధీభవన్‌కు చేరుకుని అక్కడా బైఠాయించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు ప్రగతిభవన్ ముట్టిడికి బయల్దేరగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటి బయటకు వెళ్లేందుకు యత్నించగా అరెస్టు చేశారు. విడతల వారీగా గేటు దాటేందుకు యత్నించగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించడంతో, అప్రమత్తమైన పోలీసులు గాంధీభవన్ గేట్లకు తాళం వేశారు.
అదేవిధంగా గేట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అనంతరం సీపీని కలిసేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. వార్‌రూమ్‌లో సోదాలు, సీజ్ చేయడంపై సీపీ సీవీ ఆనంద్‌కు నేతలు ఫిర్యాదుచేశారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాయి. బంజారాహిల్స్‌లోని కమాన్ కంట్రోల్ రూం వద్ద ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు విజయరెడ్డి నిరసన చేపట్టారు.
నిజంగానే అక్కడ ఏదైనా తప్పు జరిగుంటే, మీకు వచ్చిన ఫిర్యాదు కాఫీని మీరు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీరు అరెస్టు చేయడానికి లేదా దాడులు చేయడానికి, వచ్చిన వారెంట్ కాపీలను ఇచ్చి దర్జాగా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్ అల్లరి మూకల మాదిరిగా, కిరాయి గుండాల మాదిరిగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ వార్ల మీద దాడి చేశారు. -రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హనుమకొండలో ధర్నా చేపట్టిన నేతలు కాంగ్రెస్ వార్ రూమ్‌లో తనిఖీలు చేశారని మండిపడ్డారు. కరీంనగర్‌లోనూ నిరసనలు కొనసాగాయి. సిరిసిల్ల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనలు కొనసాగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వార్‌రూమ్‌లో తనిఖీలపై వ్యతిరేక గళం వినిపించారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా, భద్రాద్రి జిల్లా ఇల్లెందులో టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడిచేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ కార్యకర్త బక్క జడ్సన్ వెల్లడించారు.
ఇవీ చదవండి: