ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పని చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకులుగా పని చేసిన స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్‌లకు మాత్రమే పదవులిచ్చారని... ఉద్యోగులకు మాత్రం పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 ఎందుకు పెంచలేదని సీఎంను నిలదీశారు.
ఉద్యోగ సంఘాల నాయకులు తమ బంధువులు, కుటుంబ సభ్యుల పదవీకాలం పొడిగింపు కోసం పైరవీలు చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక మహిళ నాయకురాలు అత్యంత సన్నిహిత బంధువుకు రెండేళ్ల ఉద్యోగ కాలం పెంచారని అలాగే... ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి బంధువుకు ఎక్సైజ్ శాఖలో పదవీకాలాన్ని పొడిగించారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల పేరుతో పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. దాదాపు 15 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా...కొత్త ఉద్యోగాలు లేవని ఆయన పేర్కొన్నారు.