Warangal Declaration: రైతు నివేదికను గడపగడపకు చేరవేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి.. హైదరాబాద్ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మే 6న వరంగల్ సభలో రైతు డిక్లరేషన్‌కు ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీలకు సముచిత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమి లేని రైతు కుటుంబానికి రూ. 12 వేల రూపాయలు ఇస్తామని మల్లు రవి అన్నారు. ధరణి వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధరను ప్రకటించడంతో పాటు వారి కోసం ప్రత్యేక రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మే 21 నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. గడపగడపకు రైతు డిక్లరేషన్ ప్రతులను అందించాలని పేర్కొన్నారు.
రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అది రాహుల్ గాంధీతోనే సాధ్యం. పెద్ద ఎత్తున గ్రామం నుంచి మొదలై పట్టణ ప్రాంతాల వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే రైతులకు సముచిత న్యాయం జరుగుతుంది. తెరాస పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేకత విధానాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలు తెరాసను నమ్మే ప్రసక్తి లేదు. మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది.
ఇవీ చదవండి: వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ రైతు రచ్చబండ