Congress Leader Mallu Ravi Fires on KTR, Harish Rao : గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శనివారం జరిగిన శాసనసభ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే విధంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను(Democratic values) కాపాడుతూ ప్రభుత్వం నాయకులకు అసెంబ్లీలో సంపూర్ణంగా మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు.
Telangana Assembly Sessions 2023 : మొదటి రోజునే ప్రతిపక్ష నాయకులు ఎదురుదాడికి దిగడం, ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు పిల్లి శాపాలు పెట్టడం చూస్తుంటే ప్రభుత్వం పోయి వాళ్లు ఎంత బాధలో ఉన్నారో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పది రోజులలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విషయాలను బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) జీర్ణించుకోలేకపోతున్నారని ఆయనొక ప్రకటనలో దుయ్యబట్టారు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది : సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వం ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చేశారని, ఇనుప కంచెలను తొలగించారన్న ఆయన, తొలిరోజే ఒక వికలాంగురాలికి ఉద్యోగం ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో(Congress Six Guarantees) రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామన్న ఆయన, నిరంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సమస్యలపై సమీక్షలు చేసి పరిష్కారాలు చూపుతున్నారని వివరించారు. ఇలాంటి ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటుంటే, బీఆర్ఎస్ నాయకులు భరించలేకపోతున్నారని విమర్శించారు.
Mallu Ravi Comments on BRS Party : బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వ పది రోజుల పరిపాలనలో తమ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనను చూసి చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు భ్రమలు వదిలి వాస్తవంలో బతికి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
PCC Vice President Niranjan on Medigadda Issue : మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు అందులో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, సిట్టింగ్ జడ్జితో విచారణ ప్రకటించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ తెలిపారు. మేడిగడ్డ ఘటన జరిగి సుమారు 2 నెలలు గడుస్తున్నా గత ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే(L&T Construction Company) పునరుద్ధరణ చేస్తుందని అక్టోబర్ 28న కేటీఆర్ ఎలా చెప్పారని, ఇప్పుడు ఆ సంస్థ చేతులెత్తివేస్తే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.
మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి
బాధ్యత వహించాల్సిన ఇరిగేషన్ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేయకుండా ఎందుకు అచేతనముగా ఉన్నారని ఆక్షేపించారు. రాబోయే వర్షాకాలం లోపల మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యం కాదని, పునరుద్ధరణ చేయకపోతే మరింత నష్టం అవుతుందన్నారు. అందుకు వీరందరూ బాధ్యులు కారా అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే నిపుణుల సమావేశము ఏర్పాటు చేసి అసలు పునరుద్ధరణ అవకాశాలున్నాయా లేదా అనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వాలన్నారు.
'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్‌గానే ఉంటాడు' - జగ్గారెడ్డి చెప్పిన కథ వింటారా