Congress Focus on Poll Management in Telangana : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 30కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మరో 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 20 నియోజకవర్గాల్లో ప్రచారం చెయ్యాలని పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి - 75 నుంచి 78 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటు పక్కా : భట్టి విక్రమార్క
Congress Top Leaders Campaign in Telangana : మరోవైపు నిన్న (మంగళవారం) సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో అలంపూర్ చేరుకుంటారు. అక్కడ సభలో పాల్గొని.. సాయంత్రం 4 గంటలకు నల్గొండ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని దిల్లీ వెళతారు.
Telangana Assembly Elections 2023 : ఎన్నికలు దగ్గర పడడంతో కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఖర్గేతో కలిసి స్థానిక నాయకులతో సమావేశమై.. తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం సికింద్రాబాద్, మేడ్చల్ మల్కా జిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులపై.. గాంధీభవన్‌లో పలువురు ముఖ్య నేతలతో చర్చించారు. బీజేపీ గెలవకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన కాంగ్రెస్.. ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతల రాక - ప్రచార కాక
ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి..: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన కేసీ వేణుగోపాల్.. ఆశించిన స్థాయిలో బలం లేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా తాజా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. ఇవాళ నిజామాబాద్ నాయకులతో పాటు.. రాష్ట్రంలోని 119 స్థానాల్లో రాజకీయ పరిస్థితులపై ఆయా నియోజకవర్గాల నాయకులతో సమీక్ష చేస్తారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు చేయనున్న కేసీ వేణుగోపాల్.. పోల్ మేనేజ్‌మెంట్ ఏ విధంగా ఉండాలి, ఓటర్లను పోలింగ్ బూతుల వరకు తరలించేందుకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలనే అంశాలపై హస్తం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అగ్రనేతల కోసం 6 హెలికాప్టర్లు..: ప్రచారాన్ని మరింత విస్తృతం చేసిన కాంగ్రెస్.. ఆరు హెలికాప్టర్‌లను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 24న ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. 24, 25, 27 తేదీల్లో ప్రియాంక ప్రచారం చేస్తారు. 24, 25, 26 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ అగ్ర నాయకులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఈ నెల 28వ తేదీ వరకు హస్తం అగ్ర నేతలు.. రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.