Congress Flash Survey in Telangana : వరుస పరాజయాలు, వైఫల్యాలు నేర్పిన పాఠాలతో.. ఇక గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఎన్నికల క్రతువులో కీలక ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తలపండినంత సీనియార్టీ, దిల్లీ పెద్దల అండదండలుంటే చాలు.. ఇంటికే టికెట్ వచ్చే పరిస్థితులకు స్వస్తీ చెబుతూ.. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టే సత్తా ఉందా లేదా అనేదే ముఖ్యమన్న తీరుగా టికెట్ల కేటాయింపు ప్రక్రియ చేపడుతోంది. అందుకే చివరి వరకు టికెట్ వస్తుందా.. లేదా.. అనేది కాంగ్రెస్‌లో కొమ్ములు తిరిగిన నేతలకు చెమటలు పట్టించే పరిస్థితి నెలకొంది.
congress MLA Ticket Tension in Telangana : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్(Election Notification) వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. కమిటీల వారీగా పరిశీలన చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. గతంలో చేసిన సర్వేలపై స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న రాష్ట్ర నాయకులు అనుమానాలు వ్యక్తం చేయటం.. పార్టీలో చేరేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో పలు నియోజకవర్గాల్లో మరోసారి ఫ్లాష్ సర్వేను చేపట్టింది.
Congress Candidate MLA Tickets List 2023 : గతంలో మాదిరిగానే టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని భావించిన కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఆశావహుల నుంచి ఇప్పటికే భారీగానే దండుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ కీలక బాధ్యతలు కలిగిన నాయకుడు.. టికెట్ ఆశిస్తున్న నాయకుడి నుంచి దాదాపు మూడు కోట్లు వసూలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల టికెట్ కోసం 10 నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నేత కోట్లలోనే దండుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Congress MLA Tickets in Telangana 2023 : పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న మరికొందరు నాయకులు దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, టికెట్లు ఇప్పిస్తామని, ఏఐసీసీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్ ఠాక్రే, ముగ్గురు ఇంఛార్జి కార్యదర్శుల ద్వారా ప్రయత్నిస్తామని చెప్పి కూడా కొందరు వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ఒకరిద్దరు నేతలు.. తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో మాదిరిగా నాయకుల మాటలు విని, టికెట్లిచ్చే ద్వారాలను కాంగ్రెస్ అధిష్ఠానం మూసివేసినట్టు ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. మొదట్లో ఈ విషయం తెలియక కొందరు నేతలు లాబీయింగ్ చేస్తూ వచ్చినా.. చివరకు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునే పరిస్థితులు కనిపించలేదు.
Sunil Kanugolu Survey in Telangana : కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే(Sunil Kanugolu Survey)లపై పలువురు స్క్రీనింగ్ కమిటీలో అనుమానాలు లేవనెత్తటంతో వాటిని నివృత్తి చేసేందుకు ఏఐసీసీ మరోసారి సర్వేలు జరుపుతోంది. ఒక్క బృందంతో కాకుండా మూడు టీంలు రంగంలోకి దిగి, ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఏఐసీసీ ప్రతినిధిగా సునీల్ కనుగోలు బృందం, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ టీం, గాంధీ కుటుంబం నుంచి మరో బృందం రాష్ట్రంలో ఈ సర్వేలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి నియోజకవర్గంలో 500లోపు మాత్రమే నమూనాలు సేకరించి, సర్వే జరపగా.. ఈ దఫా 3వేల వరకు శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపులో గెలుపు గుర్రాల ఎంపికకు సర్వేలే కీలకమైనందున స్క్రీనింగ్ కమిటీ భేటీ తరచూ వాయిదా పడుతోంది. తాజా సర్వేల ఫలితాలు వచ్చిన వెంటనే స్క్రీనింగ్ కమిటీ సమావేశమై.. మొదటి జాబితాకు చెందిన పేర్లను ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది.
Sunil Election Survey in Karnataka : కర్ణాటక ఎన్నికల్లో(Karnataka Election) సర్వే ప్రకారం 135 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండే అభ్యర్థులకి ఇస్తే 135 గెలించింది.. పార్టీ బలం ఉన్న అభ్యర్థులను 18 సీట్లు కేటాయిస్తే.. కేవలం ఒక్కరు మాత్రమే గెలుపొందారు. ఈ అనుభవంతో కాంగ్రెస్ అధిష్ఠానం సర్వేలను మరింత ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. తెలంగాణలోనూ సందేహాలకు తావు లేకుండా పకడ్బందీగా సర్వేలు జరిపి.. ఆ మేరకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Next Screening committee meeting Date : సమవుజ్జీలున్న నియోజకవర్గాలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నాయకుల బలాబలాలపై కూడా ఈ ఫ్లాష్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సర్వేలు పూర్తై నివేదికగా అందజేయగా.. శుక్ర, శనివారాల్లో మిగతా నివేదికలు వస్తే ఈ నెల 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశముంది. సర్వేల్లో వెల్లడైన అంశాలతో పాటు నియోజకవర్గాల వారీగా సంక్షిప్త సమాచారం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు 70మంది అభ్యర్థులతో తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది.