Congress Dharani Adalat Campaign in Peddapalli: ధరణి పోర్టల్‌తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు.పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ధరణి అదాలత్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ధరణి వల్ల రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ సర్కారు ధరణి పేరుతో పేదల భూములను వారికి కాకుండా చేస్తోందని ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే అన్నారు. భూ హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. పేదలకు కేసీర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఉందని అన్నారు. పేదల భూములు వారికి చెందేలా చేసే వరకు ధరణి అదాలత్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
"ధరణి పోర్టల్ ఓ మాఫియాగా మారింది. కేటీఆర్ మనుషులు ధరణి మాఫియా వెనుక ఉన్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యక్తిగత సమాచారం దేశాలు దాటి పోతోంది. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు లాక్కునే కుట్ర జరుగుతోంది. 2024 జనవరి 1న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం." అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎల్పీ నేతమల్లు భట్టివిక్రమార్క ఏమన్నారంటే: ఉత్పత్తి రంగం కొద్ది మంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసిందని చెప్పారు. తెలంగాణలో ఏ పోరాటం జరిగినా.. భూమికోసమే జరిగిందని గుర్తు చేశారు. స్వతంత్ర భారత దేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాం అని తెలిపారు. పేదలకు పంచిన భూములను ధరణి చట్టంలోకి చేర్చకుండా పక్కనబెట్టారని వెల్లడించారు.
పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో కేసీఆర్‌ను నిలదీశాం. ఫ్యూడల్ వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని బీఆర్ఎస్ మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ధరణి పోర్టల్‌ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కాస్తు కాలమ్‌తో పాటు ఇతర కాలమ్స్‌ను మళ్లీ పునరుద్ధరిస్తాం అని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏమన్నారు: రాష్ట్రంలో మన భూమి మనకు దక్కాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ధరణితో న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ధరణి సర్వరోగనివారిణిలా చిత్రీకరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో లక్షలాది మందికి అసైన్డ్ భూములు ఇచ్చామని.. ఇప్పుడు ఆ భూములన్నింటిని ధరణి పేరుతో పేదలకు కాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: