మంత్రి కేటీఆర్‌పై పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మండలి ఎన్నికల ప్రచారంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని... ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి, ఖమ్మం-నల్గొండ-వరంగల్ మండలి పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికల సందర్భంగా వివిధ విద్యాసంస్థలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సికింద్రాబాద్‌లోని ఓ ఫార్మసీ కళాశాలలో సమావేశమై తెరాస అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్‌లు జత చేసి పంపుతున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున మంత్రితో పాటు ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.