గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడాన్ని కాంగ్రెస్.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అనూహ్యంగా ఓటింగ్ శాతం పెరిగిన పోలింగ్ బూతులకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల కౌంటర్ స్లిప్‌లను, వీడియోలను పరిశీలించాలని కోరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రం ఒక్కసారిగా పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్... ఎన్నికల సంఘం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సాయంత్రం 5 గంటలకు 37.11శాతంగా ఉన్న పోలింగ్ శాతం గంటలో 46.6 శాతానికి పెరగడంలో తెరాస, ఎంఐఎం, భాజపా పాత్ర ఉందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ ఆరోపించారు. ఎక్కడైతే చివరి గంటలో అధిక ఓట్లు పోలయ్యాయో... అక్కడ అన్ని రకాల పరిశీలన చేసిన తరువాతే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : గ్రేటర్‌లో తెరాసకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్