Congress Comments on BRS Party : కాంగ్రెస్ పార్టీ రైతుబంధు ఆపేందుకు కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల నగదు బదిలీని.. నోటిఫికేషన్‌కు ముందే పూర్తి చేయాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్కు.. పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని.. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఫిర్యాదు చేశామన్నారు.
Revanth Reddy Complaint To EC on BRS : బీఆర్ఎస్ పార్టీ.. విశ్రాంత అధికారులకు పదవులు ఇచ్చి ప్రైవేటు ఆర్మీగా వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా ప్రైవేటు ఆర్మీని వాడుతున్నారని ఆరోపించారు. విశ్రాంత అధికారులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభాకర్‌రావు, వేణుగోపాల్‌రావు, నర్సింగ్‌రావు, రాధాకిషన్‌రావు, జగన్మోహన్‌రావు, భుజంగరావు, ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశామని.. ప్రభుత్వ జీతభత్యాలతో ప్రైవేటు ఆర్మీని తయారు చేసుకున్నారని మండిపడ్డారు.
'కేసీఆర్.. మరో కొత్త ఆర్మీతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేయించి కేసులు పెడుతున్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు కీలక శాఖలను ఏడెనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్ కీలకశాఖల్లో పని చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్‌కు పైసా సాయం చేయవద్దని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు.' అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Revanth Comments on BRS : బీఆర్ఎస్కు పార్టీకి ఎన్నికల నిర్వహణ బృందంగా కొంత మంది అధికారులు పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ క్యాడర్ అధికారిని డీజీపీగా నియమించారని.. ఏపీ క్యాడర్ అధికారి సోమేశ్ కుమార్‌ను కోర్టు తొలగించిందని గుర్తు చేశారు. డీజీపీ, ఎన్నికల అధికారులను తొలగించాలని.. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్టీఫెన్ రవీంద్రను తొలగించాలని.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.
"కేసీఆర్ అవినీతిపై పోరాడుతామని.. కొందరు నేతలు బీజేపీలోకి చేరుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజల సొమ్ము దోచుకున్నది పంచుకుంటున్నారని గ్రహించారు. దోపిడీదారులతో ఇమడలేమని.. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీగా గుర్తించారు. వీరంతా రాష్ట్రంలో అవినీతిని నిలువరించేందుకు బీజేపీలోకి చేరారు.. కానీ బీజేపీ సిద్ధాంతాలను ఆకర్షితులై ఆ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్ అవినీతిలో.. బీజేపీ నేతలు భాగస్వాములని గ్రహించి వెనక్కి వస్తున్నారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరే నేతలను సాదరంగా ఆహ్వానించి.. తగిన హోదా కల్పిస్తాం." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
Uttam Kumar reddy Comments on BRS : బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ కార్యక్రమాలకు వాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మోదీ సర్కార్.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని.. తెలంగాణలో మాత్రం దాడులు జరగడం లేదు ఎందుకని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం జాతీయ విపత్తుగా గుర్తించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Bhatti Comments on BRS : రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. రాష్ట్ర సంపదను పార్టీ ప్రయోజనాలకు బీఆర్ఎస్ వాడుతోందని విమర్శించారు. రైతు బంధు, దళిత బంధు ఇస్తామని బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హామీలను నోటిఫికేషన్‌కు ముందే అమలు చేయాలని తాము చెప్పినట్లు వెల్లడించారు.
"చిన్న విషయానికే ట్విటర్లో స్పందించే కేసీఆర్ కుటుంబం.. మేడిగడ్డ విషయంలో ఎందుకు స్పందించదు?"