Congress Bus Yatra in Telangana 2023 : అభ్యర్థుల ఎంపిక కసరత్తులో జోరు పెంచిన కాంగ్రెస్.. విస్తృతంగా జనంలోకి వెళ్లడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఇతర సీనియర్ నాయకులంతా ఇందులో పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. బస్సు యాత్రతో సమాంతరంగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana Congress Bus Yatra 2023 : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై లోక్‌సభలో చర్చ, ఓటింగ్ ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ రాలేకపోయారు. దాంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణిక్‌రావ్ ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్దిఖీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ప్రాథమిక చర్చకు పరిమితమయ్యారు.
అదే సమయంలో లోక్‌సభలో ఓటింగ్ ప్రారంభం కావడంతో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ వెళ్లిపోయారు. అనంతరం మిగతా సభ్యులు కొంతసేపు చర్చించి, సమావేశాన్ని ముగించారు. లోక్‌సభలో బిల్లులు, చర్చల ఆధారంగా ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఆధారపడి ఉంటుందని భట్టి తెలిపారు. ఈ దఫా అభ్యర్థుల ఎంపిక వేగంగానే చేస్తామని, తొలి విడతలో 50 నుంచి 55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
Congress MLA Candidates Selection Telangana 2023 : రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో కాంగ్రెస్ అధిష్ఠానం అనూహ్యంగా మార్పులు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆదేశాలతో కమిటీలో మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు చోటు కల్పించారు. కీలక కమిటీల్లో చోటు కల్పించలేదని ఎంపీ కోమటిరెడ్డి ఇటీవల పార్టీ ముఖ్య నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీలోకి ఇద్దరు నేతలను తీసుకున్నారు.
టికెట్ల విషయంలో ఎలాంటి వివాదాస్పదం లేని ఒకే పేరు కలిగిన దాదాపు 30 నియోజక వర్గాల జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది. కత్తిమీద సాములా మారిన మరో 20కి పైగా నియోజకవర్గాల అభ్యర్థులను అన్ని కోణాల్లో పరిశీలన చేసి.. వివాద రహితంగా సీఈసీకి నివేదించాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 50 నియోజక వర్గాలకు చెందిన అభ్యర్థుల్ని మొదటి జాబితా కింద నెలాఖరులోపు ప్రకటించాలని భావిస్తున్నారు.